ధరణి పోర్టల్ తో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. కేటీఆర్ పై సంచలన ఆరోపణలు

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 12:31 PM

ధరణి పోర్టల్ తో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు..  కేటీఆర్ పై సంచలన ఆరోపణలు

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ పేరుతో భూకుంభకోణం జరిగింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ధరణి పోర్టల్ తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ కమిటీ సభ్యులు తాజాగా చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈమేరకు సోమవారం ఈ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కనీవినీ ఎరగని భూ కుంభకోణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, అయినప్పటికీ అలాంటి భూములను మాజీ మంత్రి కేటీఆర్ ఫ్యామిలీకి బదలాయించారని ఆరోపించారు. 2014 వరకు రాష్ట్రంలో భూ హక్కుల విషయంలో అందరికీ సమాన న్యాయం ఉండేదని, 2015 తర్వాత చాలా మంది రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారని చెప్పారు. గత ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే భూ రికార్డులను ప్రక్షాళన చేసిందని, దీనిని దివాలా తీసిన కంపెనీకి అప్పజెప్పడంతో రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఈ కమిటీ పేర్కొంది. ప్రజా దర్బార్ లో భారీగా అందిన ఫిర్యాదులే దీనికి సాక్ష్యమని తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుకుతున్నట్లు వివరించింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ ను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల ఈ సమస్యను పరిష్కరించేందుకు ధరణి పోర్టల్ పై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పై వచ్చిన ఫిర్యాదులను, పోర్టల్ పనితీరు సహా పలు అంశాలను పరిశీలించిన ఈ కమిటీ సభ్యులు తాజాగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి కేటీఆర్ పై ఈ కమిటీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ఈ వాఖ్యలపై గత ప్రభుత్వ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారు అనేది చూడాలి.





Untitled Document
Advertisements