హైదరాబాద్ లో పెళ్ళి షాపింగ్ చేసిన కుటుంబం.. తిరుగు ప్రయాణంలో మృత్యు ఒడిలోకి

     Written by : smtv Desk | Sat, May 18, 2024, 01:32 PM

హైదరాబాద్ లో పెళ్ళి షాపింగ్ చేసిన కుటుంబం.. తిరుగు ప్రయాణంలో మృత్యు ఒడిలోకి

పెళ్ళంటే ఉండే పనుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బట్టలు, బంగారం, పెట్టుపోతలు ఇలా చాలా ఉంటాయి. అందుకే ఓ కుటుంబానికి చెందిన వారంతా పది రోజుల్లో తమ ఇంట్లో జరగనున్న పెళ్లి కోసం బట్టల షాపింగ్ చేద్దామని ఎంతో ఆనందంగా హైదరాబాద్ వెళ్లారు. కుటుంబమంతా నచ్చిన దుస్తులు కొనుక్కొని సంతోషంతో తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చి ఐదుగురిని బలిగొంది. ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌, బెంగళూరు హైవేపై గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద కారు, లారీ ఢీకొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఘటనస్థలిలోనే ముగ్గురు దుర్మరణం పాలవగా గుత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. మృతులను అనంతపురంలోని రాణినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అనంతపురంలోని రాణినగర్ లో నివసించే షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఏడుగురు కుటుంబ సభ్యులు కారులో పెళ్లి బట్టల షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వస్తుండగా గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతులను అల్లీ సాహెబ్ (58), షేక్. సురోజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమాన్ (4), రెహనాబేగం (40)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Untitled Document
Advertisements