అన్నదాతకు ఆపన్న హస్తం 'రైతు బంధు'

     Written by : smtv Desk | Sat, May 12, 2018, 10:42 AM

అన్నదాతకు ఆపన్న హస్తం 'రైతు బంధు'

హైదరాబాద్, మే 12 : భారతదేశంలో వ్యవసాయ రంగంకు ఉన్న ప్రాధాన్యత కోసం వేరే చెప్పకర్లేదు. వ్యవ 'సాయం' ఆ పేరులోనే సాయం ఉంది. తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి, కాసింత అదృష్టాన్ని నమ్ముకొని.. జాతికి తన రెక్కల శ్రమతో ఆహారాన్ని అందిస్తున్న రైతుకు తగిన ఫలం దక్కుతుందా..? ఆలోచించకండి.. లేదు అనే సమాధానం నిక్కచ్చిగా చెప్పాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యథను గుర్తించి అన్నదాతకు ప్రతి సంవత్సరం పునాస, యాసంగి ( ఖరిఫ్, రబీ) పంటకాలాల్లో ప్రతి రైతుకు 'రైతుబంధు' పథకంద్వారా ఎనిమిది వేలు రూపాయల వంతున సహాయం అందించనుంది. కష్టాల కడలిలో కొట్టుమిట్టడుతున్న రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం నిజంగా వరంలాంటిదే.


కేసీఆర్ చెప్పినట్లుగా కర్షకుడికి కావలసినవి భూమి, పెట్టుబడి, నీళ్ళు. భూ రికార్డుల ప్రక్షాళనతో రైతు యాజమాన్య హక్కును ప్రభుత్వం పక్కా చేసింది. రుణమాఫీ, 24 గంటలు ఉచిత విద్యుత్, కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు గులాబీ దళం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. కేసీఆర్ చేస్తున్న ఈ మహత్తర పనులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. పుడమితల్లిని పవిత్రంగా చూసుకునే రైతన్న విత్తు నాటిన నుండి... పంట చేతికొచ్చే వరకు రోజు శ్రమనే నమ్ముకుంటాడు. అలాంటి కర్షకుడికి కష్టం ఏ రూపంలో వస్తుందో తెలిదు.


ముఖ్యంగా వ్యవసాయం వర్షాధారం అయిన మనదేశంలో రుతుపవనాల స్థితి పిచ్చోడి చేతిలో రాయి లాంటింది. ఏ క్షణం అతివృష్టి, అనావృష్టి వస్తుందో.. చెప్పలేం. ఒక వేళా పంట చేతికొచ్చిన సరైన గిట్టుబాటు ధరలు ఉండవు. అమ్మితే ఆడవి కొనబోతే కొరివిలా ఉంటుంది. ఈ లోపు పెట్టుబడి కోసం చేసిన అప్పులు, వాటికీ వడ్డీలు, ఇలా ఎన్నో ఆటుపోట్లు మధ్య రైతు జీవితం నడుస్తుంది. కొన్ని సార్లు అప్పులు తీర్చలేక, ఆత్మాభిమానం చంపుకోలేక పొలంలో పురుగులకు వాడాల్సిన మందులను తాగి నేలతల్లి ఒడికి చేరిన అభాగ్యులు ఎంతో మంది. ఈ కన్నీటి కథలో ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టిన రైతు సంక్షేమం గాలిలో దీపంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలబడాలి. రైతు అంటే జాతి ఆహార భద్రతను కంటికి రెప్పలా కాచుకొనే సైనికుడు. రైతు సంక్షేమంతోనే గ్రామ, రాష్ట్ర, దేశాభ్యుదయం ముడిపడి ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకొని కేంద్రం ముందుకు వచ్చి అన్నదాతను అదుకుంటే దేశంకు అంతా కంటే అభివృద్ధి ఇంకొకటి ఉండదు.

Untitled Document
Advertisements