యో యో పై.. సీవోఏ కన్ను..!

     Written by : smtv Desk | Mon, Jun 25, 2018, 12:56 PM

యో యో పై..  సీవోఏ కన్ను..!

న్యూఢిల్లీ, జూన్ 25 : టీమిండియా క్రికెట్ జట్టులో ఫిట్‌నెస్‌ పాత్ర ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పని లేదు. జాతీయ జట్టులో ఎంపికైనప్పటికి యో-యో టెస్ట్ లో విఫలమైతే ఇక జట్టులో చోటు కోల్పోయినట్లే. కాగా ఇటీవల కాలంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్‌ కమిటీ నిర్వహిస్తోన్న యో-యో టెస్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. కేవలం అరగంటపాటు చేసే పరీక్ష ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను ఎలా నిర్ధరిస్తారని మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యో యో పరీక్షనే ఎందుకు ప్రామాణికంగా తీసుకొంటున్నారని వినోద్‌ రాయ్‌ నేతృత్వంలోని పాలకుల కమిటీ(సీఓఏ) బీసీసీఐని ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇటీవల ఐపీఎల్‌లో రాణించిన అంబటి రాయుడు, సంజూ శాంసన్‌ ఇద్దరూ యో-యో టెస్టులో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో యో యో టెస్టు నిర్వహణ అనేది చర్చకు తెరలేపింది. 'యో- యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశమని, అందువల్ల సీవోఏ చీఫ్‌ ఇప్పటివరకూ కలగజేసుకోలేదని, అయితే రాబోయే రోజుల్లో క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ సబా కరీమ్‌ నుంచి సంపూర్ణ సమాచారం తెలుసుకొంటారని" బీసీసీఐ అధికారి వివరించారు. కాగా, ఇప్పటికే యో యో టెస్ట్‌ను ఎప్పుడు, ఎలా అమల్లోకి తీసుకొచ్చిందీ వంటి వివరాలను తెలియజేస్తూ బీసీసీఐ ట్రెజరర్‌ అనిరుధ్‌ చౌదరి ఆరు పేజీల లేఖను సీవోఏకు అందించారు.





Untitled Document
Advertisements