థాయ్‌లాండ్‌ గుహ : మరో ముగ్గురు చిన్నారులు బయటకు..

     Written by : smtv Desk | Mon, Jul 09, 2018, 06:58 PM

థాయ్‌లాండ్‌ గుహ : మరో ముగ్గురు చిన్నారులు బయటకు..

మే సాయ్‌, జూలై 9 : థాయ్‌లాండ్‌లోని తామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకున్నవారి కోసం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో బందీలైన 12 మంది చిన్నారుల్లో నలుగురిని ఆదివారం (జులై 8) బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్.. సోమవారం (జులై 9) మరో ముగ్గురు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వీరిలో బలహీనంగా ఉన్న ఒకరిని వేగంగా హెలికాప్టర్ ద్వారా చియాంగ్ రాయ్ ఆసుపత్రికి తరలించారు.

మిగిలిన ఇద్దరికి గుహకు సమీపంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బయటకు వచ్చిన వారి సంఖ్య 7కు చేరింది. ఇంకా కోచ్‌తోపాటు మరో ఐదుగురు చిన్నారులను రక్షించాల్సి ఉంది. రక్షించినవారి వివరాలను అధికారులు స్థానిక మీడియాకు వెల్లడించడంలేదు. అయితే రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మిగిలిన వారిని కాపాడటానికి మరింత సమయం పట్టవచ్చు. ఆదివారం నలుగురు చిన్నారులను కాపాడిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్‌కు కొన్నిగంటలపాటు నిలిపివేసిన అధికారులు.. కొన్ని గంటల తర్వాత సహాయక చర్యలను తిరిగి ప్రారంభించారు.

జూన్‌ 23న థాయ్‌ లుయాంగ్‌ గుహని సందర్శించేందుకు వెళ్లిన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుహలో నీటిమట్టం, బురద బాగా పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గుహలో తప్పిపోయి 10 రోజుల తర్వాత ఇద్దరు బ్రిటీష్‌ డైవర్లకు సజీవంగా కనిపించిన ఫుట్‌బాల్‌ టీమ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది.





Untitled Document
Advertisements