ఆ సైకోని తక్షణమే శిక్షించాలి: హాజీపూర్‌ గ్రామస్థులు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 02:44 PM

ఆ సైకోని తక్షణమే శిక్షించాలి:  హాజీపూర్‌ గ్రామస్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే సైకో శ్రావణి, మనీషా, కల్పనలను అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డిని.. ఈ నెల 8న పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదవడంతో కస్టడీ కోసం నల్గొండలోని మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు.

ఈ నేపథ్యంలో కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ ఈ నెల 8న రాచకొండ కమిషనరేట్ పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఆ రోజు నుంచి రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో విచారణ నిర్వహించిన తర్వాత.. శ్రీనివాస్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. తరువాత ప్రత్యేక భద్రత నడుమ వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.

కాగా, సైకో సెనివాస్ రెడ్డిని తక్షణమే శిక్షించాలంటూ అతని చేతిలో హత్యకు గురైన శ్రావణి తల్లిదండ్రులతోపాటు హాజీపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, రెడ్డి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరాహార దీక్ష నేపథ్యంలో హాజీపూర్‌లో పోలీసులు ముందస్తు బలగాలను మోహరించారు.

Untitled Document
Advertisements