పాక్ జట్టులో కీలక మార్పులు!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:41 PM

పాక్ జట్టులో కీలక మార్పులు!

లాహోర్: ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ ఇదివరకే ప్రకటించిన జట్టులో మార్పులు చేస్తూ సోమవారం కొత్తగా ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను ప్రకటించింది. జట్టులో చోటు చేసుకున్న మార్పుల వివరాలను పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్‌ఉల్‌హాక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఓపెనర్ అబిద్ అలీకి బదులు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అసిఫ్ అలీని ఎంపిక చేసినట్లు వివరించారు. అలాగే ఫహీమ్ అష్రఫ్‌కి బదులు మహ్మద్ అమిర్, జునైద్ ఖాన్‌కి బదులు వాహబ్ రియాజ్‌ని తుది జట్టులో చేర్చినట్లు తెలిపారు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టు ప్రదర్శన నేపథ్యంలో మార్పులు చేయక తప్పలేదన్నారు. 2011, 2015 ప్రపంచకప్‌లలో బౌలర్ వాహబ్ రియాజ్ ఆ జట్టులో కీలక పాత్ర పోషించాడు. అయితే మహ్మద్ అమిర్‌కు మాత్రం ఇదే తొలి ప్రపంచకప్. అమిర్ ఎంపికపై కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నా, రియాజ్ ఎంపిక మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిలా ఉండగా అసిఫ్ అలీ కుమార్తె 18 నెలల పసిపాప రెండు రోజుల క్రితం మరణించిందని ఆమె అంత్యక్రియల్లో పాల్గొని అసిఫ్ తిరిగి ఇంగ్లాండ్ చేరుకుంటాడని ఇంజమామ్ వివరించారు.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దవగా మిగతా నాలుగింటిలో పాక్ జట్టు 350కి పైగా పరుగులు ఇచ్చింది. దీంతో తమ జట్టు బౌలింగ్ బాగోలేదని భావించిన పీసీబీ వాహబ్ రియాజ్‌కి చోటు కల్పించిందని ఇంజమామ్ స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements