బీజేపీ గెలిస్తే ఆ ఊరు ఖాళీ చేసేస్తారట!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 01:44 PM

బీజేపీ గెలిస్తే ఆ ఊరు ఖాళీ చేసేస్తారట!

ఉత్తర ప్రదేశ్‌లోని నయాబన్స్ గ్రామం.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తలెత్తినట్టుగా చెబుతున్న హిందూ-ముస్లిం ఘర్షణలకు ప్రత్యక్ష నిదర్శనం. గోధుమ పొలాలు, ఇరుకిరుకు సిమెంటు రోడ్లు, ఎడ్లబండ్లు, పాడి ఆవులతో కళకళలాడే ఈ గ్రామంలో ఇప్పుడు ముస్లింలకు దిగులు పట్టుకుంది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తాము ఈ ఊరు ఖాళీచేయాల్సి వస్తుందన్న భయమే దీనికి కారణం.

2014కి ముందు వరకు పెళ్లిళ్లు మొదలు చావుల దాకా అన్ని కార్యక్రమాల్లోనూ హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా ఈ గ్రామస్తులు కలిసి నడిచారు. మోదీ ప్రధాని అయిన 2014 తర్వాత... ప్రత్యేకించి యూపీలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన 2017 తర్వాత జరిగిన పరిణామాలతో నిలువునా రెండుగా చీలిపోయారు.

‘‘ఇదివరకు గ్రామంలో అంతా చక్కగా ఉండేది. సంతోషంలోనూ, దుఃఖంలోనూ హిందూ ముస్లింలు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఒకే గ్రామంలో ఉన్నా విడివిడిగా బతకాల్సిన పరిస్థితి నెలకొంది..’’ అని గుల్ఫాం అలీ అనే ఓ షాపు యజమాని వాపోయాడు. ‘

‘మోదీ, యోగీ ఈ విబేధాలకు మరింత ఆజ్యం పోశారు. హిందూ ముస్లింలను విడదీయడమే వారి ఏకైక అజెండా. ఇంతకు ముందు ఈ పరిస్థితి లేదు. మాకు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఉంది. కానీ ఎలా వదిలి వెళ్లాలో అర్థం కావడం లేదు..’’ అని అలీ పేర్కొన్నాడు. ఇప్పటికే తన చిన్నాన్న సహా 12 కుటుంబాలకు పైగా ఊరు ఖాళీ చేసేశాయనీ... ఇక తాము కూడా ఊరు విడిచివెళ్లక తప్పేలా లేదని అతడు పేర్కొన్నాడు.

గతేడాది డిసెంబర్లో బులంద్‌షహర్ జిల్లాలో గోవధ జరగడం.. తదనంతరం చెలరేగిన హింసాకాండలో పోలీసు అధికారి సుబోధ్‌సింగ్‌తోపాటు ఓ ఆందోళనకారుడు మృతిచెందడం తెలిసిందే. దీంతో గోవధకు పాల్పడ్డారని అనుమానిస్తూ నయాబన్స్ గ్రామానికి చెందిన ఏడుగురు ముస్లింలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లు చోటుచేసుకున్న చింగ్రావటి గ్రామానికి నయాబన్స్ 3కి.మీ. దూరంలో ఉంది.

కాగా ఈ ఘటన జరిగి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ తాము ఆ గాయాలు మర్చిపోలేదని గ్రామంలోని ముస్లింలు చెబుతున్నారు. నయాబన్స్‌లో మొత్తం 4 వేల మంది జనాభా ఉండగా ముస్లింలు కేవలం 400 మంది మాత్రమే ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం మత విభజన రాజకీయాలతో తమకు సంబంధంలేదని చెబుతోంది. ‘‘మా ప్రభుత్వం హయాంలో ఎలాంటి అల్లర్లు జరగలేదు. ఎక్కడో జరిగిన నేరాలను హిందు-ముస్లిం గొడవలుగా చిత్రీకరించి చూపడం దారుణం...’’ అని బీజేపీ ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements