400 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు వ్యోమ‌గాములు

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:52 PM

400 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు వ్యోమ‌గాములు

అంత‌రిక్షంలోకి మాన‌వుల‌ను పంపేందుకు భార‌త్ గ‌గ‌న్‌యాన్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మిష‌న్ కోసం కావాల్సిన వ్యోమ‌గాముల‌ను త్వ‌ర‌లో సెలెక్ట్ చేయ‌నున్నారు. భార‌త వాయుసేన ఆ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్న‌ది. రానున్న రెండు నెల‌ల్లో ప‌ది మంది ఆస్ట్రోనాట్స్‌ను ఐఏఎఫ్ ఎంపిక చేయ‌నున్న‌ది. అయితే ఆ జాబితా నుంచి చివ‌ర‌గా ముగ్గురు వ్యోమ‌గాముల‌ను ఇస్రో ఎంపిక చేస్తుంద‌ని దాని చైర్మ‌న్ కే శివ‌న్ తెలిపారు. ఆస్ట్రోనాట్స్‌కు భార‌త వాయుసేన ట్రైనింగ్ ఇస్తుంద‌న్నారు.

బెంగుళూరులో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లో తొలి రెండు ద‌శ‌ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంది. తుది ద‌శ శిక్ష‌ణ విదేశాల్లో ఉంటుంది. 2021 నుంచి 22 మ‌ధ్య కాలంలో ఇస్రో గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌ను చేప‌ట్ట‌నున్న‌ది. భార‌త ఆస్ట్రోనాట్ల‌ను గ‌గ‌న‌తలంలోకి తీసుకువెళ్లే సీఈ-20 ఇంజిన్‌ను ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఇటీవ‌లే ప‌రీక్షించారు. గ‌గ‌న్‌యాన్ సిబ్బందికి డీఆర్‌డీవో లైఫ్ స‌పోర్ట్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేస్తుంది.

హ్యూమ‌న్ క్యాప్సూల్‌ను సేక‌రించేందుకు భార‌తీయ నౌకాద‌ళం స‌హ‌క‌రించ‌నున్న‌ది. ఇస్రోకు చెందిన హ్యూమ‌న్ స్పేస్ ఫ్ల‌యిట్ సెంట‌ర్‌లో ఆస్ట్రోనాట్స్ కోసం సెలెక్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు. సుమారు 10వేల కోట్ల‌తో గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దాదాపు 400 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు వ్యోమ‌గాముల‌ను పంపనున్నారు. గ‌త ఏడాది ఈ ప్రాజెక్టుకు మోదీ స‌ర్కార్ ప‌చ్చ‌జెండా ఊపింది. ముగ్గురు భార‌త వ్యోమ‌గాముల్లో ఓ మ‌హిళా వ్యోమ‌గామి కూడా ఉంటుంది.

Untitled Document
Advertisements