పెళ్లి ఇష్టం లేదన్న యువతి.... వరుడితో ముందుగానే కాపురం చేయించిన తల్లిదండ్రులు

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 02:27 PM

పెళ్లి ఇష్టం లేదన్న యువతి.... వరుడితో ముందుగానే కాపురం చేయించిన తల్లిదండ్రులు

ఆమెకు చదువుకుని మంచి స్థాయిలో స్ధిరపడాలని కోరిక. తల్లిదండ్రులకు మాత్రం ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత వదిలించుకుందామన్న తాపత్రయం. పదహారేళ్ల వయసులోనే ఆమెను ఓ రెండో పెళ్లివాడికిచ్చి పెళ్లిచేయాలనుకుంటే కుదరలేదని అతనితోనే కాపురం చేయించి ఆమె గొంతుకోశారు.

వివరాల్లోకి వెళితే...సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాలిక బాలసదనంలో ఆశ్రయం పొందుతోంది. ఇటీవల ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అక్కడి సిబ్బంది బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భవతి అని వైద్యులు చెప్పడంతో కంగుతిన్నారు. దీనికి కారణమేంటని అధికారులు ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.

గత విద్యా సంవత్సరం పదో తరగతి పూర్తిచేసిన సదరు బాలిక తనను ఇంటర్‌లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరింది. కానీ వారు బలవంతంగా ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు. అప్పటికే పెళ్లయిన వ్యక్తితో మూడు నెలల క్రితం నిశ్చితార్థం చేశారు. పెళ్లి ఇష్టం లేదని, ఆపించాలని తెలిసిన వారి ద్వారా బాధితురాలు అధికారులను ఆశ్రయించడంతో వారు అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమని, ఆమె ఇష్టాన్ని గౌరవించాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి వెళ్లిపోయారు.

అయినా మార్పురాని బాలిక తల్లిదండ్రులు నిశ్చితార్థమైన వ్యక్తితో పెళ్లికాకుండానే బలవంతంగా కాపురం చేయించారు. కొన్నాళ్లు నరకం అనుభవించిన బాలిక ఇంట్లో నుంచి పారిపోయి మళ్లీ అధికారులను ఆశ్రయించింది. పరిస్థితిని గుర్తించిన అధికారులు బాలికకు బాలసదనంలో ఆశ్రయం కల్పించారు.

కానీ అప్పటికే ఆమెతో సదరు వ్యక్తి కాపురం చేసి ఉండడంతో గర్భవతి అయ్యింది. అనారోగ్యానికి గురికావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాలిక కుటుంబానికి చెందిన నలుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. బాలికకు అబార్షన్‌ చేయించారు.





Untitled Document
Advertisements