ఆర్థిక పరిస్థితులపై నిర్మలా సీతారామన్‌తో మోదీ సమీక్ష

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:37 AM

ఆర్థిక పరిస్థితులపై నిర్మలా సీతారామన్‌తో మోదీ సమీక్ష

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై ప్రస్తుత దేశీయ ఆర్థిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో సంపద తుడిచిపెట్టుకుపోతుండడం, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడడం వంటి పరిణామాలతో దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా మందగమనం వెళుతోంది అని చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రితో పాటు ఆమె శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మందగమనం, దీర్ఘకాలికంగా దాని ప్రభావంపై భేటీలో చర్చించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశం గురించి సమాచారం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధికి ఇ-మెయిల్ ద్వారా వివరాలు కోరగా ఎలాంటి సమాధానం రాలేదు.భారతదేశ ఆర్థిక వృద్ధి 2018-19లో 6.8 శాతానికి మందగించింది.- 2014-15 నుండి నెమ్మదిగా వినియోగదారుల విశ్వాసం క్షీణిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, కరెన్సీ యుద్ధం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోయింది. 2014-15 నుంచి ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. ఈసారి వినియోగదారుల విశ్వాసం స్థాయి క్షీణంచగా, మరోవైపు విదేశీ పెట్టుబడులు కూడా వెనక్కి వెళుతున్నాయి. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే ప్రయత్నాలకు సహాయపడటానికి సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది పాలసీ వడ్డీ రేటును 1.10 శాతం తగ్గించింది.ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల ఈక్విటీ ప్యాకేజీని ప్రకటించింది. బ్యాంకుల్లో ఎన్‌పిఎ(మొండి బకాయిలు)ల పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది వినియోగ వస్తువులు, గృహాల రుణాలను ప్రభావితం చేస్తుంది. ఎన్‌బిఎఫ్‌సి కంపెనీలకు నిధుల ప్రవాహాన్ని పెంచడానికి సెంట్రల్ బ్యాంక్ ఇటీవల కొన్ని అదనపు చర్యలు చేపట్టింది.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పటిష్టం చర్యలు చేపట్టగా, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ ఈ నెల ప్రారంభంలో మందగమనం స్వల్పకాలమేనని, నాల్గవ త్రైమాసికం నాటికి వృద్ధి దిశగా పయనిస్తుందని అంచనా వేశారు.అయితే మందగమనం తీవ్రత ఉండవచ్చనే ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. ఆటో రంగం అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆటోమొబైల్, అనుబంధ పరిశ్రమల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అమ్ముడుపోని గృహాల సంఖ్య పెరగ్గా, ఎఫ్‌ఎంసిజి కంపెనీలు మొదటి త్రైమాసికంలో వాల్యూమ్ వృద్ధిలో క్షీణతను నివేదించాయి. పరిశ్రమలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం 2018 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 0.9 శాతం నుండి ఈ ఏడాది అదే కాలానికి 6.6 శాతానికి పెరిగింది. అయితే జూన్ త్రైమాసికంలో ఉద్యోగ కల్పన ఎంఎస్‌ఎంఇ రంగానికి 0.7 శాతం నుండి 0.6 శాతానికి పడిపోయింది.ఎఫ్‌ఎంసిజి రంగంలో హిందూస్తాన్ యునిలివర్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.5 శాతం వాల్యూమ్ వృద్ధిని నమోదు చేసింది. గతేడాదిలో 12 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

అలాగే డాబర్ గత సంవత్సరం 21 శాతం వృద్ధిని సాధించగా, ఈసారి 6 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ వాల్యూమ్ వృద్ధి కూడా గత ఏడాది ఇదే కాలంలో 12 శాతం నుండి 6 శాతానికి పడిపోయింది. గత సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏసియన్ పెయింట్స్ 12 శాతం వృద్ధిని చూపగా, ఈ సంవత్సరం 9 శాతం వరకు వృద్ధిని తగ్గించింది.పెట్టుబడులను పెంచడానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించేందుకు గాను ఆర్థికమంత్రి సీతారామన్ ఈ నెల ప్రారంభంలో బ్యాంకర్లు, పరిశ్రమలు, ఈక్విటీ ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలతో వరుస సమావేశాలు నిర్వహించారు. విదేశీ పెట్టుబడిదారులపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.2 కోట్లకు మించిన ఆదాయంపై అధిక సర్‌చార్జిని ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల) విధించవద్దని ఆర్థికమంత్రికి పారిశ్రామికవేత్తలు సూచించారు. అయితే సర్‌చార్జిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపగా, ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అయితే ఈ నెల ప్రారంభంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు గాను వరుసగా నాలుగవసారి కీలక రుణ రేటును తగ్గించింది. రేటు తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయాలని బ్యాంకులను కోరింది.ప్రత్యక్ష పన్ను వసూళ్లు కేవలం 1.4 శాతం పెరిగాయి.

జూలై వరకు జిఎస్‌టి వసూళ్ల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం కూడా 9% మాత్రమే ఉండగా, కేంద్ర బడ్జెట్‌లో 18 శాతంగా అంచనా వేశారు. కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 సంవత్సరాల కనిష్టానికి తగ్గగా, 300 డీలర్‌షిప్‌లు మూసివేతకు గురయ్యాయి. ఈ రంగంలో సుమారు 2.30 లక్షల మంది ఉద్యోగులపై వేటుపడింది. ఆటో కాంపోనెంట్ తయారీ పరిశ్రమలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్) పేర్కొంది.





Untitled Document
Advertisements