మారుతీ సుజుకీలో 3వేల ఉద్యోగుల కోత...వ్యాపారంలో ఒక భాగమే

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 12:58 PM

మారుతీ సుజుకీలో 3వేల ఉద్యోగుల కోత...వ్యాపారంలో ఒక భాగమే

గత కొద్ది నెలలుగా వాహనాల కొనుగోలు మరీ అధ్వానంగా మారిన నేపథ్యంలో వివిధ రకాల సంస్థలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కూడా తాత్కాలిక ఉద్యోగాల్లో భారీగా కోత విధించింది. కాంట్రాక్టులు రెన్యువల్ చేయకపోవడంతో 3వేల మంది తాత్కాలిక సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ స్వయంగా వెల్లడించారు. శాశ్వత ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండబోదని స్పష్టం చేశారు. ‘ఇది వ్యాపారంలో ఒక భాగమే. మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగినప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటాం. డిమాండ్ తగ్గితే ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తాం. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో దాదాపు 3000 మంది తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయట్లేదు’ అని ఆర్‌సీ భార్గవ మీడియాకు తెలిపారు. కొంతకాలంగా వాహన విక్రయాలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో ఆటోమొబైల్ పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ లేకపోవడం, నిల్వలు పెరిగిపోవడంతో కొన్ని సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయి. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఆయా సంస్థలు ఉద్యోగాల కోత బాట పడుతున్నాయి. దీనిపై భార్గవ స్పందిస్తూ.. ‘ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే త్వరలోనే ఆటో రంగం పుంజుకుంటుంది. బీఎస్ 6 వాహనాలు వచ్చిన తర్వాత 2021 ఆర్థిక సంవత్సరం నాటికి వాహనరంగం బలంగా వృద్ధి చెందుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. వాహనాలపై జీఎస్టీని తగ్గించి ఆటో రంగాన్ని ఆదుకోవాలని కొంతకాలంగా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements