మహిళలపై నేరాల కేసులు...బిజెపి చట్టసభ సభ్యులే అత్యధికం

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:55 AM

మహిళలపై నేరాల కేసులు ఎదుర్కొంటున్న చట్టసభ్యుల్లో
బిజెపి వారు అధిక సంఖ్యలో ఉన్నారని ఎన్నికల నిఘా సంఘం అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఎడిఆర్) వెల్లడించింది. మెజార్టీ సభ్యులు 21 మంది బిజెపి వారు కాగా, కాంగ్రెస్ వారు 16 మంది, వైఎస్‌ఆర్‌సిపి 7 మంది ఉన్నారని ఎన్నికల నిఘా సంఘం అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఎడిఆర్) వెల్లడించింది. మహిళలపై నేరాల కేసులు ఎదుర్కొంటున్న ఎంపిల సంఖ్య 2009లో రెండు కాగా, 2019లో 19కి పెరిగింది. అత్యాచారానికి సంబంధించి గత ఐదేళ్లలో ముగ్గురు ఎంపిలు, ఆరుగురు ఎమ్‌ఎల్‌ఎలు కేసుల్లో ఇరుక్కోగా, అత్యాచార కేసుల్లో ఉన్న 41 మందికి గుర్తింపు పొందిన పార్టీలు టికెట్లు ఇవ్వడం గమనార్హం. మహిళలపై నేరాల కేసులున్న వారిలో 66 మందికి గత ఐదేళ్లలో లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ బిజెపి అభ్యర్ధులుగా టికెట్లు దక్కా యి.

అటువంటి అభ్యర్ధులు 46 మందిని కాంగ్రెస్, 40 మందిని బిఎస్‌పి ఎన్నికల్లో పోటీ చేయించాయి. ప్రస్తుత 759 మంది ఎంపిల, 4063 మంది ఎంఎల్‌ఎల మొత్తం 4896 అఫిడవిట్లలో 4822 అఫిడవిట్లను పరిశీలించినట్టు ఎడిఆర్ వివరించింది. ఆ సమయంలో మహిళలపై నేరాలు చేసిన చరిత్ర కలిగిన లోక్‌సభ అభ్యర్థుల సంఖ్య 38నుంచి 126కు పెరిగిందని, అంటే 231 శాతం పెరుగుదల కనిపించిందని నివేదిక వెల్లడించింది. ఈమేరకు పశ్చిమబెంగాల్‌లో అత్యధిక సంఖ్యలో ఎంపిలు, ఎంఎల్‌ఎలు 16 మంది ఉండగా, ఒడిశా, మహారాష్ట్రల్లో చెరో 12 మంది వంతున సభ్యులు ఉన్నారు.

గత ఐదేళ్లలో అటువంటి నేర చరిత్ర కలిగిన 572 మంది అభ్యర్థులు లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వీరిలో ఏ ఒక్క అభ్యర్థికీ శిక్ష పడలేదు. గుర్తింపు పొందిన పార్టీల నుంచి టికెట్లు పొందిన నేర చరిత అభ్యర్ధులు 410 మందిలో 89 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలకు నియామక మయ్యారు. గత ఐదేళ్లలో అఫిడవిట్లలో మహిళలపై నేరాలు చేసినట్టు అభియోగాలు దాఖలైనప్పటికీ మహారాష్ట్ర నుంచి అత్యధిక సంఖ్యలో 84 మంది, బీహార్ నుంచి 75 మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీల నుంచి టికెట్లు పొందగలిగారు.





Untitled Document
Advertisements