"క్రికెటర్లు నోరుజారితే.. కఠిన శిక్షలు"

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 01:38 PM


మైదానంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసే క్రికెటర్లకి కఠిన శిక్షలు వేయాలని వెస్టిండీస్ టెస్టు టీమ్ కెప్టెన్ జేసన్ హోల్డర్ డిమాండ్ చేశాడు. జులై 8 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు.. 14 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్‌ని పూర్తి చేసుకుని ప్రాక్టీస్ చేస్తోంది. అయితే.. ఇటీవల నల్ల జాతీయులపై వివక్షత మళ్లీ పెరుగుతుండగా.. అమెరికాలో పోలీసుల దుశ్చర్య కారణంగా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ రోడ్డు పక్కనే ప్రాణాలు వదిలాడు. దాంతో.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండగా.. ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్’ ఉద్యమానికి కరీబియన్ జట్టు కూడా సపోర్ట్‌గా నిలుస్తోంది.
వాస్తవానికి కొన్ని దేశాలకి చెందిన క్రికెటర్లు కూడా సుదీర్ఘకాలంగా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడే సమయంలో తనపై కొందరు జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ డారెన్ సామీ ఇటీవల ఆరోపించగా.. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిలే ఫెహ్లుక్వాయో‌ని ‘ఏయ్ నల్లోడా’ అని పిలిచి ఏడాది క్రితం పాకిస్థాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆ జాతి వివక్ష వ్యాఖ్యలు కొనసాగుతున్నాయని కొంత మంది క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.

క్రికెట్‌లో జాత్యంహకార జాడ్యం పూర్తిగా తొలగిపోవాలంటే.. మ్యాచ్ ఫిక్సర్లు, డోపింగ్‌కి పాల్పడే ఆటగాళ్లకి విధించే కఠినమైన శిక్షల్ని విధించాలని జేసన్ హోల్డర్ డిమాండ్ చేశాడు. ‘‘క్రీడల్లో జాతి వివక్ష‌ని డోపింగ్, ఫిక్సింగ్‌ తరహా నేరంగానే పరిగణించి.. శిక్ష విధించాలి. వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఆ వివక్షని ఎదుర్కొలేదు. కానీ.. చాలా సార్లు విన్నా.. కొన్నింటిని చూశాను కూడా. ప్రతి సిరీస్‌కి ముందు డోపింగ్, ఫిక్సింగ్ గురించి ఆటగాళ్లకి అవగాహన కల్పించినట్లే.. జాత్యంహర రూల్స్‌పై కూడా చెప్తే మంచిది’’ అని హోల్డర్ వెల్లడించాడు.

Untitled Document
Advertisements