బాక్సింగ్ డే టెస్టు: వేదిక మార్చాలనే డిమాండ్స్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:41 PM

బాక్సింగ్ డే టెస్టు: వేదిక మార్చాలనే డిమాండ్స్

భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా ఈ ఏడాది జరగనున్న బాక్సింగ్ డే టెస్టు వేదిక మారనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ నాలుగు టెస్టుల సిరీస్‌ని అక్కడ టీమిండియా ఆడనుండగా.. డిసెంబరు 26 నుంచి 30 వరకూ బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. అయితే.. మెల్‌బోర్న్ పరిసరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతుండటంతో.. వేదిక మార్చాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి.
ఆస్ట్రేలియాలో సాధారణంగా బాక్సింగ్ డే టెస్టుకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం మెల్‌బోర్న్‌లో ఆ టెస్టుని నిర్వహిస్తే..? అప్పటికి కరోనా వైరస్ అదుపులోకి రాకపోతే కేవలం 10-20 వేల మంది ప్రేక్షకుల్ని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. ప్రతిష్ఠాత్మక టెస్టు మ్యాచ్‌లో అంత తక్కువ మంది ప్రేక్షకులు ఉంటే సందడేముంటుంది..? అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ప్రశ్నించాడు. ఆ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ మజాని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే అడిలైడ్ లేదా పెర్త్ స్టేడియంలో నిర్వహించాలని సూచించాడు.

‘‘భారత్, పాకిస్థాన్ మధ్య 2015 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్‌లో మ్యాచ్‌ జరగగా.. టికెట్లు హాట్‌కేకుల్లా కేవలం 50 నిమిషాల్లో అమ్ముడుపోయాయి. అందుకే.. బాక్సింగ్ డే టెస్టుని అడిలైడ్‌లో నిర్వహిస్తే బాగుంటుంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ వేదికగా ఉన్న మెల్‌బోర్న్‌లో క్రిస్మస్ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో..? ఇప్పుడే ఊహించడం కష్టం. ఎందుకంటే.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే ఆ ప్రాంతంలో కొంతభాగం లాక్‌డౌన్‌లో ఉంది. దాంతో.. ఆ టెస్టు మ్యాచ్‌కి ప్రేక్షకుల్ని కూడా పరిమిత సంఖ్యలో అనుమతించే అవకాశం ఉంది. అప్పుడు బాక్సిండ్ డే టెస్టులో సందడి ఏముంటుంది..? అందుకే అడిలైడ్ లేదా పెర్త్‌లో మ్యాచ్‌ని నిర్వహిస్తే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది’’ అని మార్క్ టేలర్ సూచించాడు.

Untitled Document
Advertisements