హర్భజన్‌కి అన్యాయం జరిగింది: కుంబ్లే

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 05:43 PM

హర్భజన్‌కి అన్యాయం జరిగింది: కుంబ్లే

భారత్, ఆస్ట్రేలియా క్రికెట్‌ని 12 ఏళ్ల క్రితం మంకీగేట్ వివాదం కుదిపేసింది. సిడ్నీ వేదికగా 2008లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోతితో పోల్చడం అప్పట్లో వివాదానికి దారితీసింది. మైదానంలో క్రమశిక్షణ తప్పి సైమండ్స్‌పై భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. అతనిపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. కానీ.. హర్భజన్‌పై ఆ నిషేధాన్ని ఎత్తివేయకపోతే ఆ టూర్‌ని బహిష్కరిస్తామని టీమిండియా హెచ్చరించింది. దాంతో.. వెనక్కి తగ్గిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.వాస్తవానికి ఆ టూర్‌లో అనిల్ కుంబ్లే కెప్టెన్సీలోని టీమిండియా ఏకతాటిపైకి వచ్చి.. హర్భజన్‌ సింగ్‌కి అండగా నిలిచింది. సిడ్నీ టెస్టులోనే అంపైర్ల తప్పిదాలు భారత్‌‌కి కోపం తెప్పించాయి. అయినప్పటికీ.. భారత క్రికెటర్లు సహనంతో వ్యవహరించారు. ఆఖరిగా ఒక జట్టు మాత్రమే క్రీడాస్ఫూర్తితో ఆడిందంటూ అనిల్ కుంబ్లే హుందాగా స్పందించడం.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి అప్పట్లో పెద్ద చెంపపెట్టు. కానీ.. మంకీగేట్ వివాదం.. హర్భజన్ సింగ్ కెరీర్‌లో ఓ మచ్చలా మిగిలిపోయింది.

మంకీగేట్ వివాదం గురించి తాజాగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ షో 'DRSWithAsh'లో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ ‘‘ఒక కెప్టెన్‌‌గా మైదానంలో నిర్ణయాలు తీసుకోవడం మామూలే. కానీ.. ఆ టూర్‌లో కెప్టెన్‌గా నాకు భిన్నమైన సవాల్ ఎదురైంది. అందరి అభిప్రాయాలు, మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జాత్యహంకార వ్యాఖ్య అంటూ హర్భజన్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అది అన్యాయమని మాకు తెలుసు. అందుకే.. అప్పీల్‌కి వెళ్లాం. అప్పట్లో భారత్ జట్టు టూర్‌ని బహిష్కరిస్తుందనే అంశంపై ఎక్కువగా చర్చ జరిగింది. కానీ.. అందరూ టీమిండియాకి సిడ్నీ టెస్టులో అన్యాయం జరిగిందని అంగీకరించారు. అందుకే టీమ్‌కి మద్దతుగా నిలిచారు’’ అని కుంబ్లే వెల్లడించాడు.

Untitled Document
Advertisements