హిందూ సాంప్రదాయంలో క్రిస్టియన్ యువకుడితో ముస్లిం యువతికి వివాహం!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 01:02 PM

హిందూ సాంప్రదాయంలో క్రిస్టియన్ యువకుడితో ముస్లిం యువతికి వివాహం!

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం. ఎన్ని మతాలు ఉన్నా.. మనమంతా భారతీయులమే అని గర్వంగా చెప్పుకుంటాం. పరమత సహనాన్ని పాటిస్తూ.. మతాలన్నీ సమానమే అని నమ్ముతాం. ఒక మతానికి చెందిన పండుగలను మరో మతస్థులు జరుపుకోవడం మన దగ్గర సహజమే. కానీ రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకొని తమ ఆచారాలకు భిన్నంగా మరో మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవడం మాత్రం విశేషమే కదా. ఖమ్మం జిల్లా తల్లాడలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన కోపిల అనిల్ కుమార్ ఖమ్మంలో ఇంటర్ చదివాడు. ఆ సమయంలోనే ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన షేక్ సోనీ అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇంటర్ తర్వాత ఆటో నడుపుతున్న అనిల్.. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సోనీ పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. కానీ అనిల్ క్రిస్టియన్, తాము ముస్లింలం కావడంతో షేక్ సోనీ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు.

వీరిద్దరూ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి లేదా ఇస్లాం ఆచారాల ప్రకారం నిఖా చేసుకోవాలి. కానీ అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం 9.49 గంటలకు వీరి పెళ్లి జరిగింది. అనిల్ కుటుంబ సభ్యుల సహకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంటను పలువురు అభినందిస్తున్నారు.





Untitled Document
Advertisements