అన్నదాతలకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్...

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:49 PM

అన్నదాతలకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్...

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది.రైతులకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌కు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎస్‌బీఐ ఈ కొత్త ఫీచర్‌కు కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ అని పేరు పెట్టింది. ఈ కొత్త ఫీచర్ సదుపాయంతో రైతులు ఇక బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. క్రెడిట్ కార్డు లిమిట్‌ పెంచుకోవడం కోసం అదేపనిగా ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లక్కర్లేదు. కేవలం 4 క్లికులతో కేసీసీ లిమిట్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇంట్లో నుంచే ఎలాంటి డాక్యుమెంట్లతో పని లేకుండా సులభంగా కేసీసీ లిమిట్‌ను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు లభించింది. ప్రస్తుతం రైతులు స్మార్ట్‌ఫోన్స్ కలిగి ఉన్నారని, అందుకే వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌బీఐ తెలిపింది. కేసీసీ రీయింబర్స్‌మెంట్ ఫీచర్ ద్వారా దాదాపు 75 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని బ్యాంక్ అంచనా వేసింది.

కేసీసీ రివ్యూ వల్ల రైతులు సులభంగానే వారి లిమిట్‌ను రివైజ్ చేసుకోవచ్చని, టైమ్ కూడా చాలా ఆదా అవుతుందని స్టేట్ బ్యాంక్ తెలిపింది. కేవలం ఇది మాత్రమే కాకుండా ఇంకా రైతులకు పలు సౌకర్యాలు అందిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. యోనో కాటా, యోనో సేవింగ్స్, యోనో మిత్ర, యోనో మండి వంటి వాటి ద్వారా అన్నదాతలు ప్రయోజనం పొందొచ్చని బ్యాంక్ తెలిపింది.





Untitled Document
Advertisements