కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పు

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 06:07 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పు

తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. కాళేశ్వరం పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ పేర్కొంది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది. జలశక్తి శాఖ ఆదేశాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాలని తెలిపింది. సవరణ ఆదేశాలు ఇచ్చిన తర్వాత తదుపరి పనులు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ తన బాధ్యతలను సరిగా నిర్వహించలేదని ఆరోపించింది. వెనుకబడిన ప్రాంతాల ప్రజల కోసం ప్రాజెక్టు నిర్మాణం, భారీగా నిధులు కేటాయించడం వల్ల ఇప్పుడు అనుమతులు రద్దు చేయడం సరికాదని చెప్పింది. పర్యావరణ అనుమతులపై నెల రోజుల్లో కమిటీ వేయాలని సూచించింది. 2008-2017 వరకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 6 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తన తీర్పులో వెల్లడించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందు కెళ్లొద్దని ఆదేశించింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ లో చెప్పినట్లు డీపీఆర్ లు సమర్పించాక కేంద్రం నిర్ణయం తీసుకన్నాక ముందుకెళ్లొచ్చని ఆదేశించింది.





Untitled Document
Advertisements