ముంబై పేలుళ్ల సూత్రధారి జకీర్‌ రెహమాన్‌ లఖ్వీకి 15 ఏళ్ల జైలుశిక్ష

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 05:15 PM

ముంబై పేలుళ్ల సూత్రధారి జకీర్‌ రెహమాన్‌ లఖ్వీకి 15 ఏళ్ల జైలుశిక్ష

ముంబై పేలుళ్ల సూత్రధారి జకీర్‌ రెహమాన్‌ లఖ్వీ (61)కి పాకిస్థాన్ కేసు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు అందించారనే కేసులో లఖ్వీకి న్యాయస్థానం శుక్రవారం (జనవరి 8) 15 ఏళ్ల జైలుశిక్ష వేసింది. కోర్టు ఆదేశాల మేరకు లఖ్వీని వెంటనే జైలుకు తరలించనున్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జకీర్‌ రెహమాన్‌ లఖ్వీని పాకిస్థాన్ పోలీసులు జనవరి 2న అరెస్టు చేశారు. ముంబై పేలుళ్ల సూత్రధారుల్లో ఇతడొకడు. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడనే కేసులో పాకిస్థాన్‌ పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.

భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడంతో పాకిస్థాన్ పోలీసులు లఖ్వీని 2015లోనే అరెస్టు చేశారు. అయితే, అతడు బెయిల్‌‌పై బయట ఉన్నాడు. ముంబై పేలుళ్ల ఘటనపై భారత్ తగిన ఆధారాలు బయటపెట్టింది. అయితే.. పాక్ మాత్రం ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. లఖ్వీని నిమిత్త మాత్రంగానే అరెస్టు చేసింది. అతడిని ఎక్కడ అరెస్టు చేశారు? కేసు అంశం ఎక్కడి వరకు వచ్చింది? ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడు? అనే వివరాలను పాక్ ఇప్పటివరకు బయటకు వెల్లడించలేదు. లాహోర్‌ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానంలో లఖ్వీపై విచారణ జరుగుతోందని మాత్రమే పాక్ వెల్లడించింది.

2008 నవంబర్ 26న సాయుధులైన ముష్కరులు మర బోట్లలో సముద్ర మార్గం ద్వారా ముంబైలో ప్రవేశించారు. ఆ తర్వాత వరుస పేలుళ్లతో మారణహోమానికి తెగబడ్డారు. పేలుళ్ల అనంతరం అత్యాధునిక ఆయుధాలతో రక్తపాతం సృష్టించారు. ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.





Untitled Document
Advertisements