మిథున్ చక్రవర్తిపై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:14 PM

మిథున్ చక్రవర్తిపై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బెంగాల్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని మిథున్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మిథున్ చక్రవర్తిపై టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిథున్‌కి ఎలాంటి విశ్వసనీయత, గౌరవం లేదు, ప్రజలను ఆయన ఏ విధంగానూ ప్రభావితం చేయలేరని రాయ్ వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకూ మిథున్ చక్రవర్తి నాలుగు సార్లు పార్టీలు మారారని, ఇప్పుడు కూడా ఈడీ కేసులు చూపించి బీజేపీ బెదిరించడంతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఆ పార్టీలో చేరారని ఆరోపించారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి ఆయనో నక్సలైట్ అంటూ అభివర్ణించారు.‘‘వాస్తవానికి మిథున్ చక్రవర్తి గతంలో ఓ నక్సలైట్. అనంతరం సీపీఎం పార్టీలో చేరాడు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇదిగో ఇప్పుడు బీజేపీ బెదిరింపులకు భయపడి ఆ పార్టీలో చేరాడు’ టీఎంసీ ఎంపీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ.. బెంగాల్ రాజకీయం వేడెక్కింది. ప్రధాని మోదీ కోల్‌కతా పర్యటనతో.. బీజేపీ, టీఎంసీ మధ్య మరోసారి మాటలు తూటాలు పేలాయి. దీదీ పాలనను టార్గెట్‌గా చేసుకొని మోదీ విమర్శలు గుప్పించగా.. మమతా బెనర్జీ సైతం వాటికి ధీటుగా సమాధానం ఇచ్చారు. బీజేపీ డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తోందని మమత ఆరోపించారు. ‘‘వాళ్లు ఓటుకు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం టీఎంసీకి వేయండి’’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements