ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్యే అయ్యాడు!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 12:34 PM

ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్యే అయ్యాడు!

ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్యే అయ్యాడు. ఈ ఆసక్తికర ఘటన మణిపూర్‌లో జరిగింది. 2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో హెన్రీ సింగ్ (32) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన 16 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఆ తరువాతి స్థానంలో 12 వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఎరబోట్ సింగ్ నిలిచారు.

అయితే ఎన్నికల అనంతరం హెన్రీ సింగ్ బీజేపీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. అప్పటికే ఆయనపై హైకోర్టు కేసు నడుస్తోంది. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రత్యర్థి కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే హెన్రీ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేసినందున వాంగ్‌కేయిలో ఉప ఎన్నిక నిర్వహించాలని కోరారు.

అయితే ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అప్పటికే అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచారన్న కేసు విచారణలో ఉంది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు, క్రిమినల్ కేసులకు సంబంధించి అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ధారించిన హైకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఉపఎన్నిక అవసరం లేకుండానే రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించేసింది. దీంతో ఎన్నికల్లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైన ఎరబోట్ సింగ్ ఎమ్మెల్యే అయ్యారు.





Untitled Document
Advertisements