జూన్ నెల కూడా పూర్తికావస్తున్నా రైతు బంధుపై స్పందించని అధికారులు..

     Written by : smtv Desk | Sat, Jun 18, 2022, 11:11 AM

జూన్ నెల కూడా పూర్తికావస్తున్నా రైతు బంధుపై  స్పందించని అధికారులు..

అన్నదాతల ఎదురుచూపులు నిధుల కోసం ప్రభుత్వం అన్వేషణ పంపిణీపై సీఎంవో నుంచి రాని ఆదేశాలు లబ్ధిదారుల వివరాలు సేకరించని వ్యవసాయ శాఖ రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశిం చింది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ రైతుబంధు పంపిణీ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం నుంచి అందే పీఎం కిసాన్‌ నిధులు రైతులకు అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు ఎప్పుడు వస్తుందోనని కర్షకులు ఎదురు చూస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకోగా మొదటి విడత మినహా ప్రతీ విడతలోనూ జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో జూన్‌ మొదటి వారం నుంచే రైతుబంధు అందుతుందని అందరూ భావించినా..ఈ నెల కూడా పూర్తవుతుండడంతో ఇంకా నగదు మాత్రం జమకాలేదు. అయితే ఈ సీజన్‌ రైతుబంధు పంపిణీకి సంబంధించి సీఎం కార్యాలయం నుంచి
వ్యవసాయ శాఖకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. దీంతో పాటు వానాకాలం సీజన్‌లో రైతుబంధు పథకంలోకి ఎంతమంది కొత్తగా నమోదు అయ్యారన్న వివరాలను కూడా సేకరించ లేదని తెలియవస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కమిషనర్‌ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాల కోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్తారు. కమిషనర్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో పథకం ఎపుడు ప్రారంభం అవుతుందోనని అన్నదాతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత సీజన్‌కు సుమారు రూ.7,411కోట్లకు పైగా నిధులు అవసరం పడుతాయని ప్రాధమికంగా తెలుస్తుండగా, పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తే లబ్ధి దారుల వివరాల్లో మార్చు ఉండే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.





Untitled Document
Advertisements