రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్ క్రికెటర్‌ కు వీసా సమస్య..

     Written by : smtv Desk | Tue, Feb 13, 2024, 09:07 AM

రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్ క్రికెటర్‌ కు వీసా సమస్య..

తాజాగా మరో ఇంగ్లండ్ క్రికెటర్‌కు వీసా ఇబ్బంది తలెత్తింది. ఆటగాడి వద్ద సరైఅన ధ్రువీకరణ పత్రాలు లేవంటూ ఆ జట్టు యంగ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. నగరంలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు. సోమవారం రాజ్‌కోట్‌లోని హిరాసర్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఇంగ్లండ్ జట్టు దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంలో రెహాన్ అహ్మద్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. సింగిల్ ఎంట్రీ వీసా మాత్రమే ఉండడం, అవసరమైన పత్రాలు లేకపోవడంతో నగరంలోకి ప్రవేశించకుండా అతడిని అధికారులు అడ్డుకున్నారని ‘స్పోర్ట్ స్టార్’ రిపోర్టు పేర్కొంది. కాగా మిగతా ఆటగాళ్లకు వీసా విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని రిపోర్టు తెలిపింది.

కాగా ఇండియాలోకి ప్రవేశించేటప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్లకు వీసా సంబంధిత సమస్యలు ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. ప్రస్తుత టెస్ట్ సిరీస్‌ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కొత్త స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వీసా జారీలో జాప్యం కారణంగా జట్టుతో పాటు సకాలంలో భారత్ చేరుకోలేకపోయాడు. దీంతో హైదరాబాద్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టుకు బషీర్ దూరమైన విషయం తెలిసిందే. ఇక జట్టు పేసర్ ఆలీ రాబిన్సన్‌‌కు కూడా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కాస్త ఇబ్బంది ఎదురైన విషయం తెలిసిందే. వీసాలో అక్షరం తప్పు అయ్యి ఉండొచ్చని రాబిన్సన్ ఇటీవలే పేర్కొన్నాడు. ‘‘ ఒక రాత్రి, లేదా రెండు, మూడు రాత్రులు ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సి వస్తుందని అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తూ స్వదేశానికి సత్వరమే వీసా లభించింది’’ అని ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.






Untitled Document
Advertisements