పతాంజలి ఆయుర్వేద సంస్థపై కన్నెర్ర చేసిన సుప్రీంకోర్టు.. బాబా రాందేవ్ కు సమన్లు జారీ

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 12:53 PM

పతాంజలి ఆయుర్వేద సంస్థపై  కన్నెర్ర చేసిన సుప్రీంకోర్టు..  బాబా రాందేవ్ కు సమన్లు జారీ

పతాంజలి పేరుతో బ్రాండ్ ను నెలకొల్పి ఆ పేరిట పలు ఔషధాలు, ఉత్పత్తులు విక్రయిస్తున్న బాబా రాందేవ్ తో పాటు బాలకృష్ణ ఇద్దరు చిక్కుల్లో పడ్డారు. తాజాగా పతాంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసుకు స్పందించక పోవడంతో తమ ముందు హాజరు కావాలంటూ ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. బాబా రాందేవ్ తో పాటు పతాంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కూడా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం సమన్లు పంపించింది.
పతాంజలి విక్రయిస్తున్న ఉత్పత్తులు, ఔషధాల నాణ్యతకు సంబంధించిన ప్రకటనల గురించి కోర్టుకు ఇచ్చిన ప్రాథమిక హామీని ఉల్లంఘించినందుకు గత నెలలోనే ఆ సంస్థను సుప్రీంకోర్టు నిలదీసింది. తాజాగా పతాంజలి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద మీ మీద చర్యలను ఎందుకు ప్రారంభించకూడదని పతాంజలికి, బాలకృష్ణకు జారీ చేసిన నోటీసుల్లో ప్రశ్నించింది. తమ గత ఆదేశాల తర్వాత పతాంజలి ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించిందని.. ఆ తర్వాత ఇప్పటి వరకు తమ ఆర్డర్స్ పై ఎందుకు సమాధానాన్ని ఫైల్ చేయలేదని నిలదీసింది. తదుపరి విచారణలో పతాంజలి ఎండీ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ లోని సెక్షన్లు 3, 4 (తప్పుదోవ పట్టించే యాడ్స్)లను రాందేవ్ బాబా, బాలకృష్ణలు ఉల్లంఘించారని కోర్టు తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదని రాందేవ్ కు పంపిన సమన్లలో ప్రశ్నించింది. పతాంజలి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. రాందేవ్ బాబాకు సమన్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంలోకి రాందేవ్ బాబా ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. 'తదుపరి వాయిదాకు మీరు వస్తారు కదా. అప్పుడు చూద్దాం. ఇప్పటికి ఇంతే' అని వ్యాఖ్యానించింది. మరి ఈ కేసు ఏవిధమైన మలుపు తిరుగుతుందో చూడాలి.





Untitled Document
Advertisements