నామినేషన్ దాఖలు సమయంలో రూ.25,000 నాణేలతో సెక్యూరిటీ డిపాజిట్‌.. జబల్‌పూర్ స్వతంత్ర అభ్యర్థి

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 12:42 PM

నామినేషన్ దాఖలు సమయంలో రూ.25,000 నాణేలతో సెక్యూరిటీ డిపాజిట్‌.. జబల్‌పూర్  స్వతంత్ర అభ్యర్థి

లోక్‌సభ ఎన్నికలు-2024 నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి దశ పోలింగ్‌కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర ఘటన ఒకటి మధ్యప్రదేశ్న లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వినయ్ చక్రవర్తి అనే వ్యక్తి రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్‌‌ను నాణేల రూపంలో సమర్పించారు. రూ.10, రూ.5, రూ. 2 నాణేల రూపంలో చెల్లించారు. జబల్‌పూర్ కలెక్టర్ ఆఫీస్‌లో బుధవారం ఈ ఘటన నమోదయింది. డిజిటల్‌, ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేందుకు కలెక్టర్ ఆఫీస్‌లో అవకాశం లేకపోవడంతో తన వద్ద ఉన్న నాణేలనే ఉపయోగించుకున్నట్టు చక్రవర్తి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.
కాగా వినయ్ చక్రవర్తి నాణేల రూపంలో సమర్పించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను స్వీకరించామని జబల్‌పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అభ్యర్థికి రసీదును కూడా జారీ చేశామన్నారు. కాగా ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ బుధవారమే ప్రారంభమైంది. కాగా వినయ్ చక్రవర్తి సెక్యూరిటీ డిపాజిట్‌‌ను నాణేల రూపంలో చెల్లించిన వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.





Untitled Document
Advertisements