హెబ్బె జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్ వాసి మృతి..

     Written by : smtv Desk | Tue, Jun 11, 2024, 12:47 PM

అప్పటి వరకు అంతులేని సంతోషాల్లో మునిగితేలి క్షణాల్లో అంతా తారుమారు అవుతుంది. తాజాగా పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందడం కొరకు సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కర్ణాటకలోని హెబ్బె జలపాతం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. హైదరాబాద్ నుంచి టూర్ కు వెళ్లిన శ్రవణ్ అనే యువకుడు చనిపోయాడు. కెమ్మనగుండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన శ్రవణ్ ఓ ప్రముఖ ఈ- కామర్స్ కంపెనీలో సిస్టం అనలిస్టుగా పనిచేస్తున్నాడు. శ్రవణ్ తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు పర్యటనకు వచ్చాడు. స్నేహితులు ఇద్దరూ అద్దె బైక్ పై చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చారు.

కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం చూసేందుకు వచ్చిన స్నేహితులు.. అక్కడ ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడిపారు. ఇటీవలి వర్షాలకు జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నీటి మధ్యలో ఉన్న రాళ్లపై శ్రవణ్, అతని స్నేహితుడు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కాలుజారడంతో ఇద్దరూ నీటిలో పడిపోయారు. నీళ్లలోని రాయి తగిలి శ్రవణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఈ స్నేహితులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ తో వచ్చిన పోలీసులు వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రవణ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.





Untitled Document
Advertisements