ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ టైమ్ లో ఆఫీస్ లో ఉండాల్సిందే.. కేంద్రం

     Written by : smtv Desk | Sat, Jun 22, 2024, 10:35 AM

ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ టైమ్ లో ఆఫీస్ లో ఉండాల్సిందే.. కేంద్రం

ప్రభుత్వ ఉద్యోగులు అనగానే వారు సమయానికి విధులకు హాజరు కారు, వారికి నచ్చిన సమయంలో వచ్చి ఉదయమే వచ్చినట్టు అటెండెన్స్ వేసుకుంటారు అనే అభిప్రాయం మనలో చాలామందికి ఉంటుంది. నిజానికి అనేక చోట్ల ఇలాగే జరుగుతుంటుంది కూడా. అయితే ఇకమీదట మాత్రం ఇలా జరగడం కష్టమే. ఎందుకంటే ఇష్టమొచ్చినపుడు ఆఫీసుకు వస్తానంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

కరోనా టైమ్ లో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికిన ఉద్యోగులు.. చాలాచోట్ల ఇప్పటికీ దానిని ఉపయోగించడంలేదని సమాచారం. హాజరు కోసం గతంలోలాగే రిజిస్టర్ నిర్వహిస్తున్నారని, దీంతో ఎంత లేట్ గా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ.. ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే తనపై అధికారికి సమాచారం ఇచ్చి, ఆ పూటకు క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా సాయంత్రం 5:30 తర్వాతే ఔట్ పంచ్ పడాలని స్పష్టం చేసింది.

ఉద్యోగులు ఏమంటున్నారంటే..
ఆఫీసు పనిగంటల తర్వాత కూడా తాము పనిచేయాల్సి వస్తోందని, కొన్నిసార్లు సెలవు రోజులలో కూడా ఆఫీసుకు రావాల్సిన అవసరం ఏర్పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం పూట చాలా పొద్దుపోయేదాక పనిచేస్తున్నామని వివరించారు. నియమిత పనిగంటలకు మించి తాము పనిచేస్తున్నామని, ఒక్కోసారి ఇంటి వద్ద నుంచి కూడా పనిచేస్తున్నామని చెబుతున్నారు. ఇవన్నీ గుర్తించకుండా పావుగంట ఆలస్యమైతే ఆ పూటకు లీవ్ కింద పరిగణిస్తామనే రూల్ సరికాదని అంటున్నారు. మరి ఉద్యోగుల వాదనను కేంద్రం ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాలి.





Untitled Document
Advertisements