వయగ్రాతో నాడీ సంబంధిత జబ్బు మాయం!

     Written by : smtv Desk | Thu, Jun 13, 2024, 11:11 AM

వయగ్రాతో నాడీ సంబంధిత జబ్బు మాయం!

మాములుగా మనకు వయాగ్రా అనగానే పురుషుల్లో లైంగిక సామర్థ్యం కోసం తాయారు చేయబడిన ఔషధం అనే విషయం గుర్తొస్తుంది. అయితే ఈ వయాగ్రా పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచడం కొరకు మాత్రమే కాక మరో అదనపు ప్రయోజనం కూడా ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. నాడీ సంబంధిత అనారోగ్యాలనూ ఈ మందు నయం చేస్తోందని తేలింది. వాస్క్యులర్ డిమెన్షియాగా పేర్కొనే జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే శక్తి లోపించడం వంటి సమస్యలను వయాగ్రా దూరం చేస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈమేరకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం వయాగ్రాపై ఇటీవల పరిశోధనలు నిర్వహించింది.మెదడుకు రక్త ప్రసరణను వయాగ్రా పెంచుతోందని, దీంతో నాడీ సంబంధిత జబ్బుల బారిన పడే ప్రమాదం తప్పుతోందని గుర్తించింది. పరిశోధనలో భాగంగా వయాగ్రా టాబ్లెట్ వేసుకున్న వ్యక్తికి అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించినపుడు ఈ విషయం బయటపడిందని సైంటిస్టులు చెప్పారు. రక్తప్రసరణ పెరగడం వల్ల మెదడు పనితీరు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతోందని గుర్తించినట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అలాస్టైర్ వెబ్ పేర్కొన్నారు.

వయాగ్రాగా వ్యవహరిస్తున్న సిల్డెనఫిల్ మందు సిలాస్టజోల్ తో కలిసి మెదడులో రక్తనాళాల నిరోధకతను తగ్గిస్తుందని, ఫలితంగా రక్త ప్రసరణ మెరుగవుతోందని డాక్టర్ వెబ్ చెప్పారు. ఇక సిలాస్టజోల్ తో పోలిస్తే సిల్డెనఫిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని వివరించారు. ప్రస్తుతం వాస్క్యులర్ డిమెన్షియాకు సరైన చికిత్స విధానం కానీ మందులు కానీ లేవనే విషయాన్ని డాక్టర్ వెబ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తమ పరిశోధనలో వెలుగుచూసిన విషయాలు వాస్క్యులర్ డిమెన్షియా నివారణకు తోడ్పడే అవకాశం ఉందని, అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధనలు కనుక విజయవంతం అయితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.





Untitled Document
Advertisements