ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.. పింఛన్ల పెంపుపై ఉత్తర్వులు జారీ

     Written by : smtv Desk | Fri, Jun 14, 2024, 11:10 AM

ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.. పింఛన్ల పెంపుపై ఉత్తర్వులు జారీ

ఏపీలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ మేరకు తాజాగా పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త వినిపించారు. జులై నుంచి వారు రూ. 4 వేల పెన్షన్ అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైలుపై నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడో సంతకం చేశారు. ప్రస్తుతం రూ. 3 వేల పెన్షన్ అందిస్తుండగా ఇకపై రూ. 4 వేలు అందించనున్నారు. ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది.

ఒక్కొక్కరికి రూ. 7 వేలు
తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు రూ. 4 వేల పింఛను ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జులై 1న ఒక్కొక్కరికి రూ. 7 వేల చొప్పున పెన్షన్ అందిస్తారు. ఏప్రిల్, మే, జూన్‌లో చెల్లించాల్సిన ఒక్కో వెయ్యి రూపాయలతోపాటు జులై నెల పింఛన్ రూ. 4 వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు అందిస్తారు. ఆగస్టు నుంచి మాత్రం రూ. 4 వేల చొప్పున పంపిణీ చేస్తారు.

లబ్ధిదారులు వీరే
రూ. 4 వేల పెన్షన్ అందుకునే లబ్ధిదారుల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు హెచ్ఐవీ బాధితులు, కళాకారులు ఉన్నారు.

పెన్షన్ల పెంపు ఇలా
దివ్యాంగులకు ప్రస్తుతం రూ. 3 వేలు ఇస్తుండగా, ఇకపై రూ. 6 వేలు ఇవ్వనున్నారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచానపడిన వారికి, వీల్‌చైర్‌లో ఉన్న వారికి ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 5 వేల పెన్షన్ స్థానంలో ఇకపై రూ. 15 వేలు అందిస్తారు. అలాగే, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న రూ. 5 వేల పింఛనుకు బదులు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కుష్ఠువ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి రూ. 6 వేలు ఇస్తారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
https://twitter.com/anusha_puppala/status/1801294351466959315?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1801294351466959315%7Ctwgr%5E52d2a6ad189376db074ee0985f44271c6dbad376%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fw





Untitled Document
Advertisements