ప్యాసింజెర్ వాహనాల విక్రయాల...తొమ్మిదో నెలలోనే అదే తీరు

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 11:54 AM

ప్యాసింజెర్ వాహనాల విక్రయాల...తొమ్మిదో నెలలోనే అదే తీరు

గత రెండు నెలల నుండి దేశీయ ప్యాసింజెర్ వాహనాల విక్రయాలు మరీ అధ్వానంగా పతనమయ్యాయి. జులైలో కేవలం 2,00,790 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోగా, 2018లో జులైలో ఈ సేల్స్ 2,90,931 యూనిట్లుగా ఉన్నాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు 30.98 శాతం క్షీణించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్(సియామ్) వెల్లడించింది. ఆటోమొబైల్ రంగంలో ఇంత తక్కువ స్థాయిలో అమ్మకాలు జరగడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 2000 సంవత్సరం డిసెంబరులో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 35 శాతం పడిపోయాయి. డిమాండ్ లేకపోవడంతో ఆటోమొబైల్ సంస్థల వద్ద నిల్వలు పేరుకుపోగా, ఉత్పత్తిని తగ్గించాలని కంపెనీలు భావిస్తున్నాయి. దేశీయ కార్ల విక్రయాలు 35.95 శాతం తగ్గి 1,22,956 యూనిట్లకు పరిమితమవగా, గతేడాది జులై నెలలో ఈ విక్రయాలు 1,91,979 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 జులై నెలలో 18,17,406 యూనిట్ల ద్విచక్రవాహనాలు సేల్ కాగా, గత నెలలో 15,11,692 యూనిట్లతో 16.82 శాతం తగ్గుముఖం పట్టాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా 25.71 శాతం తగ్గి 56,866 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని కేటగిరిల్లో కలిపి జులైలో వాహన విక్రయాలు 18.71శాతం తగ్గాయి. 2018 జులై నెలలో 22,45,223 యూనిట్ల వాహనాలు సేల్ అవగా, గత నెలలో కేవలం 18,25,148 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు సియామ్ నివేదిక వెల్లడించింది. వాహనాల అమ్మకాలు అధ్వాన్న స్థితి చేరడంతో ఆటోమొబైల్ వాహనాలపై జిఎస్‌టిని తగ్గించాలని పారిశ్రామికవేత్తల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వాహనాల సేల్స్ భారీగా క్షీణించడం వల్ల ఆటో రంగంలో దాదాపు 3 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగులు తమ జాబ్‌లను కోల్పోయారని సియామ్ ఈ సందర్భంగా వివరించింది. సేల్స్ లేకపోవడంతో చాలా కంపెనీలు తమ కర్మాగారాలను మూసివేస్తున్నాయని, ఉత్పత్తిని ఆపేస్తున్నాయని వెల్లడించింది. వాహనాల తయారీదారులు, విడిభాగాల తయారీదారులు, డీలర్‌లు ఏప్రిల్ నుండి దాదాపు 3,50,000 మంది ఉద్యోగులను తొలగించారని ఇటీవల మీడియా వర్గాలు తెలిపాయి. కారు, మోటారుసైకిల్ తయారీ సంస్థల్లో 15,000 మందిని, విడిభాగాల తయారీ సంస్థల్లో 1,00,000 మందిని తొలగించారని, ఇక మిగిలిన ఉద్యోగాల కోత డీలర్ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ఆటో రంగాన్ని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి ఆటో పరిశ్రమ అధికారులు ప్రభుత్వం చొరవచూపాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.





Untitled Document
Advertisements