తీర్పుపై కీలక పరిణామాలు ఉంటాయి జాగ్రత్త: ముస్లిం పక్షాలు

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 06:53 AM

తీర్పుపై కీలక పరిణామాలు ఉంటాయి జాగ్రత్త: ముస్లిం పక్షాలు

రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాద జటిల వ్యాజ్యం విచారణ తంతు ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు పరిణామాల ప్రభావం దేశ భావి సంవిధానంపై పడుతుందని, కీలక పరిణామాలు ఉంటాయని వ్యాజ్యంలో ముస్లిం పక్షాలు భావిస్తున్నాయి. తీర్పు దరిమిలా పడే ప్రభావం గురించి తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా రికార్డులలో పొందుపర్చేందుకు అవకాశం ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం ముందు ముస్లిం పక్షాల తరఫు లాయర్లు విన్నవించకున్నారు.తమ స్పందనను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలకు రికార్డులలోకి తీసుకువెళ్లాల్సి ఉందని , దీని వల్ల తమ మనసు కుదుటపడుతుందని తెలియచేసుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల సుదీర్ఘ విచారణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీన ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి వచ్చే నెల 17వ తేదీన వైదొలుగుతున్నందున అప్పటిలోగానే అత్యంత కీలకమైన అయోధ్య తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు. తీర్పు క్రమంలో ముస్లిం పక్షాలు పలు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాయి. సీల్డ్‌కవర్‌లో రాతపూర్వక నోట్‌ను దాఖలు చేసేందుకు వివిధ పక్షాలూ, అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేశాయని ముస్లిం పక్షాల తరఫు న్యాయవాది ఒకరు తెలిపారు.సీల్డ్‌కవర్‌లోని అంశాలు ఇప్పటికే కొన్ని పత్రికలలో వచ్చాయని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. సీల్డ్ కవర్‌లో అందించిన నోట్ వివరాలను సామాన్య జనం కోసం ముస్లిం పక్షాలు విడుదల చేశాయి. ఈ నోట్‌ను వారి తరఫు లాయర్ రాజీవ్ ధావన్ రూపొందించారు. ఈ నోట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పు లేదా తీసుకునే నిర్ణయం దేశంలోని కోట్లాది మంది పౌరుల స్పందనలను ప్రభావితం చేస్తుంది. 1950 జనవరి 26వ తేదీన భారతదేశం గణతంత్ర దేశంగా ప్రకటితం అయిన తరుణంలో ఖరారయిన రాజ్యాంగ విలువలను ఆపాదించుకున్న ఈ దేశ పౌరుల మెదళ్లలో కదలికలు తెస్తుందని, దీనిని గమనించాలని ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియచేసుకుంటున్నామని ఇందులో పొందుపర్చారు.
చారిత్రక తీర్పు ప్రకంపనలు ఉంటాయి జాగ్రత్త:
ఇప్పుడు వెలువడేది అత్యంత కీలకమైన తీర్పు, అద్యంతం చారిత్రకమైనది. ఈ దిశలో దీని పర్యవసనాలు, ప్రభావం తీవ్రస్థాయిలోనే ఉంటాయి. ఈ అంశాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ బాధ్యత న్యాయస్థానానిదే. వెలువరించేది చారిత్రక తీర్పు కాబట్టి, సరైన రీతిలో ఉపశమనం కల్గిస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా, ఈ గొప్ప దేశం సంతరించుకున్న సమున్నతిని నిలిపేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నామని ముస్లిం పక్షాలు తెలియచేసుకున్నాయి.సరైన రీతిలో అందరికీ రిలీఫ్ కల్గించేలా, బహుళ మత, సంస్కృతులు ఆచార వ్యవహరాల దేశ సంవిధానాన్ని సంరక్షించడంలో, ఈ దిశలో తలెతుత్తున్న సవాళ్లను పరిష్కరించడంలో న్యాయస్థానం సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ముస్లిం పక్షాలు తెలియచేసుకున్నాయి. రాజ్యాంగపు విస్తృత పరిధిలోనే ఇమిడి ఉండే న్యాయస్థానం ప్రధాన బాధ్యత ఇదేనని తెలిపారు. ఇప్పటి తీర్పును రాబోయే తరాలు ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటాయనేది సరైన రీతిలో ఆలోచించుకుని స్పందించడమే కోర్టు కల్పించే ఉపశమనం అవుతుందని అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements