ఖర్చులు తగ్గింపు దిశగా మోదీ ప్రభుత్వం…

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 09:50 AM

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం, ద్రవ్య లోటు కారణంగా ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీతో సహా కేంద్రమంత్రులంతా తమ ప్రయాణ,ఆహార,సమావేశ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు,ఆర్థిక వృద్దికి సంబంధించి ఇటీవల మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు కేంద్రమంత్రులంతా ఇకపై అనవసర ఖర్చులను తగ్గించుకోనున్నారు. ప్రయాణ,ఆహార,సమావేశాలకు సంబంధించి 20శాతం వరకు ఖర్చును తగ్గించుకోనున్నారు. దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీసీఐజీ సంబంధిత ఖర్చుల విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలకు గత వారం సీసీఐజీ సమావేశం యొక్క వివరాలను పంపించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ద్రవ్యలోటును 3.3 శాతం వద్దనే నియంత్రించేందుకు అభివృద్ధియేతర వ్యయాలను తగ్గించుకోవాలని.. కేంద్రం చేసిన ప్రయత్నంగా ఈ చర్యను చూస్తున్నారు. గత 11 ఏళ్లలో మునుపెన్నడూ లేనంతగా జీడీపీ వృద్ది రేటు 5శాతం కంటే తక్కువకు పడిపోవడంతో.. ద్రవ్య లోటును నియంత్రించడం ప్రభుత్వం సవాల్గా తీసుకుంటోంది. గతంలోనూ ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం ఇలా ఖర్చులను తగ్గించుకోవడం ఇదే మొదటిసారేమీ కాదు. అక్టోబర్, 2014లోనూ కేంద్ర ఖర్చుల విభాగం ఆయా మంత్రిత్వ శాఖలను 10శాతం ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశించింది. ఎగ్జిబిషన్లు, ఉత్సవాలు, సెమినార్లు మరియు సమావేశాల నిర్వహణలో ఆర్థిక స్థితి గతులను గమనించి ఖర్చు చేయాలని, అలాగే వాహనాల కొనుగోలు మరియు దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల ఖర్చు తగ్గించుకోవాలని అప్పట్లో సూచించింది. ఆర్థిక క్రమశిక్షణ కోసమే ప్రభుత్వ కార్యాచరణ సామర్థ్యాన్ని పరిమితం చేయడం ఈ చర్యల ఉద్దేశం కాదని, ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడానికే అని ఖర్చుల విభాగానికి సంబంధించిన సెక్రటరీ అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ఖర్చులను హేతుబద్ధీకరించడం మరియు సాధ్యమైనంత మేర అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అందులో తెలిపారు. మంత్రులు ఖర్చుల తగ్గించుకోవడంవల్ల బడ్జెట్ పొదుపుపై ప్రజలకు సంకేతాలు ఇవ్వవచ్చని కేంద్రం భావిస్తోంది.

Untitled Document
Advertisements