నాపై విష ప్రయోగం జరిగింది: ఇస్రో సీనియర్‌ సైంటిస్ట్

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 01:51 PM

నాపై విష ప్రయోగం జరిగింది: ఇస్రో సీనియర్‌ సైంటిస్ట్

మూడేళ్ల కిందట తనపై విష ప్రయోగం జరిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్‌ సైంటిస్ట్ తపన్‌ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని ఆరోపించిన ఆయన... ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. తన ఫేస్‌బుక్ పేజ్‌ ద్వారా సైంటిస్ తపన్ మిశ్రా ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు ‘లాంగ్ కెప్ట్ సీక్రెట్’‌పేరుతో మిశ్రా ఈ సంచలన ఆరోపణలు చేసినట్లు పీటీఐ వెల్లడించింది.

ఇస్రో ఆఫీసులో 2017 మే 23న ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని తపన్‌ మిశ్రా వెల్లడించారు. ఆ రోజు లంచ్ తర్వాత స్నాక్స్ టైంలో తీసుకున్న దోశ, చట్నీలో విషపూరిత రసాయం అర్సెనిక్ ట్రైఆక్సైడ్‌ను కలిపారని ఆయన ఆరోపించారు. దీంతో తన ఆరోగ్యం చాలా దెబ్బతిని కోలుకోడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని తెలిపారు. విష ప్రయోగం తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మంపై అసాధారణ దద్దుర్లు, నరాల సమస్యలు తలెత్తాయని వివరించారు.

రెండేళ్ల పాటు పలు నగరాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స తర్వాత కోలుకున్నట్లు తెలిపారు. అయితే, తన హత్యకు కుట్రపన్నినట్టు కేంద్ర హోంశాఖ ముందే హెచ్చరించిందని తెలిపారు. ఈ విషయం ముందే తెలియడంతో సకాలంలో చికిత్స తీసుకున్నానని, లేదంటే విషప్రయోగం జరిగిన రెండు మూడు వారాలకే నా ప్రాణాలు పోయేవని చెప్పారు.

గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసిన తపన్ మిశ్రా.. ఈ విషయాన్ని చాలా రోజులు రహస్యంగా దాచి ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విష ప్రయోగం జరిగిన విషయం బయటపెట్టవద్దని వందల కొద్దీ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని ఆరోపించారు. అంతేకాదు, క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన తనతో కొందరు బేరసారాలు సాగించారని, వాటిని తాను తిరస్కరించానని తెలిపారు. అనంతరం ఇస్రో కీలక బాధ్యతల నుంచి తనను తొలగించినట్లు వివరించారు.

విషప్రయోగం జరిగిన తర్వాత తీసుకున్న చికిత్సకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా మిశ్రా బయటపెట్టారు. తన శరీరంలోకి అర్సెనిక్ ట్రైఆక్సైడ్‌ చేరినట్టు ఎయిమ్స్ ధ్రువీకరించిన నివేదిక కూడా ఇందులో ఉంది. ‘గూఢచర్యంలో భాగంగా అధునాతన సైనిక, వాణిజ్య సింథటిక్ ఎపార్చర్ రాడార్ నిర్మాణంలో నైపుణ్యం కలిగిన తనను తప్పించే ప్రయత్నంలో భాగంగా విషప్రయోగం జరిగింది’ అని అన్నారు.

గతంలో అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్‌ మిశ్రా.. ప్రస్తుతం ఇస్రో సీనియర్‌ సలహాదారుగా ఉన్నారు. ఈ నెలాఖరులోనే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే తపన్ మిశ్రా వ్యాఖ్యలపై ఇస్రో ఇంకా స్పందించలేదు.





Untitled Document
Advertisements