ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:07 PM

ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

ఆస్ట్రేలియాపై టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌ నమోదు చేశాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం ఓపెనర్ శుభమన్ గిల్‌ (50: 101 బంతుల్లో 8x4)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ (26: 77 బంతుల్లో 3x4, 1x6) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కానీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన హిట్‌మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.

స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కాస్త ఇబ్బందిపడుతున్నట్లు పసిగట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ పదే పదే అతనితో బౌలింగ్ చేయించాడు. దాంతో.. 16వ ఓవర్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి మరీ లాంగాన్ దిశగా రోహిత్ శర్మ సిక్స్ బాదేశాడు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతనికే సులువైన క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ ఔటయ్యాడు. తాజా ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మకి ఇదే ఫస్ట్ మ్యాచ్.

ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఇప్పటికే 63 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. ఆ టీమ్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఈరోజు ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై 100 సిక్సర్ల మైలురాయిని హిట్‌మ్యాన్ అందుకున్నాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 424 సిక్సర్లు నమోదు చేయగా.. భారత్ నుంచి హిట్‌మ్యాన్ టాప్‌లో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ 534 సిక్సర్లతో నెం.1 స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో 476 సిక్సర్లతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఉన్నాడు.





Untitled Document
Advertisements