కరోనా గందరగోళం...థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లకి వరుసగా చేదు అనుభవాలు

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 12:38 PM

కరోనా గందరగోళం...థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లకి వరుసగా చేదు అనుభవాలు

బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లకి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. దాదాపు 10 నెలల తర్వాత భారత షట్లర్లు మళ్లీ టోర్నీలో పోటీపడేందుకు సిద్ధమవగా.. థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వాహకుల అతి కారణంగా తీవ్ర మనస్థాపాన్ని ఎదుర్కొంటున్నారు. టోర్నీ ఆరంభానికి ముందు క్రీడాకారులకి నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షల్లో తొలుత సైనా నెహ్వాల్, ప్రణయ్‌‌లకి పాజిటివ్‌గా వచ్చింది. దాంతో.. వారిని టోర్నీ నుంచి తప్పించి క్వారంటైన్‌లో ఉంచారు. కానీ.. రోజు వ్యవధిలోనే మళ్లీ వారికి కరోనా నెగటివ్ వచ్చినట్లు థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. దాంతో వారి మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. సైనా నెహ్వాల్‌కి ఇటీవల ఒకసారి కరోనా సోకిన విషయం తెలిసిందే.
సైనా నెహ్వాల్‌కి సోమవారం పాజిటివ్ రావడంతో ఆమె భర్త పారుపల్లి కశ్యప్‌ని కూడా టోర్నీ నుంచి తప్పించారు. ఇప్పుడు మళ్లీ అతని మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. అయితే.. అతని శాంపిల్స్ ఇంకా పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఇక శాంపిల్స్ సేకరించే సమయంలో అక్కడి వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తన కారణంగా కిదాంబి శ్రీకాంత్ ముక్కుకి గాయమైంది. తన ముక్కులో నుంచి రక్తం కారుతున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీకాంత్.. థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వాహకులపై విమర్శలు గుప్పించాడు.
కరోనా టెస్టులో నెగటివ్ వచ్చిన పీవీ సింధు, సాయి ప్రణీత్ తొలి రౌండ్‌లోనే పేలవరీతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా డెన్మార్క్‌కి చెందిన మియా బ్లిక్‌ఫెల్ట్‌తో పోటీపడిన పీవీ సింధు.. 21-16, 24-26, 13-21 తేడాతో ఓడిపోయింది. అలానే పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ కూడా థాయ్‌లాండ్‌కి చెందిన కాంటాఫాన్‌ చేతిలో 16-21, 10-21 తేడాతో ఓడిపోయాడు.





Untitled Document
Advertisements