లక్కీ మ్యాన్... టి. నటరాజన్ అరుదైన ఘనత

     Written by : smtv Desk | Sat, Jan 16, 2021, 08:38 AM

లక్కీ మ్యాన్... టి. నటరాజన్ అరుదైన ఘనత

టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా శుక్రవారం ఆరంభమైన నాలుగో టెస్టుతో భారత్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్.. ఒకే టూర్‌లో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. మూడో టెస్టు ఆడిన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అశ్విన్ గాయపడటంతో నటరాజన్, శార్ధూల్ ఠాకూర్‌కి నాలుగో టెస్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది.


వాస్తవానికి ఈ టెస్టు సిరీస్‌కి నటరాజన్‌ నెట్స్ బౌలర్‌‌గా మాత్రమే ఎంపికయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా టూర్‌కి అతని ఎంపికే అనూహ్యం. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తొలుత భారత సెలెక్టర్లు టీ20 జట్టులోకి ఎంపిక చేయగా.. టూర్‌ ముంగిట అతను గాయపడ్డాడు. దాంతో.. అతని స్థానంలో నటరాజన్‌కి అవకాశం కల్పించారు. అయితే.. ఆశ్చర్యకరంగా తొలుత ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలోనే నటరాజన్‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ ఛాన్సిచ్చింది. ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన నటరాజన్ 70 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

వన్డేల్లో రాణించడంతో ఆ తర్వాత టీ20 సిరీస్‌లోనూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నటరాజన్‌కి అవకాశం లభించింది. ఆ సిరీస్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్.. తన వేరియేషన్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. దాంతో.. వన్డే, టీ20 సిరీస్ ముగిసినా.. నటరాజన్‌ని స్వదేశానికి పంపకుండా నెట్స్ బౌలర్‌గా వినియోగించుకునేందుకు అక్కడే టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంచేసుకుంది. ఇప్పుడు అదే అతనికి వరమైంది. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్ , జడేజా వరుసగా టెస్టు సిరీస్‌లో గాయపడటంతో.. నటరాజన్‌కి టెస్టుల్లో ఆడే ఛాన్స్ లభించింది. మొత్తానికి ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలోనూ అతను అరంగేట్రం చేయగలిగాడు.





Untitled Document
Advertisements