‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను వాయిదా వేసుకున్న రైతులు.. పోలీసులతో ఘర్షణ నేపథ్యంలో నిర్ణయం

     Written by : smtv Desk | Thu, Feb 22, 2024, 08:05 AM

 ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను వాయిదా వేసుకున్న రైతులు.. పోలీసులతో ఘర్షణ నేపథ్యంలో నిర్ణయం

ఎండనక, వాననక కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని కన్నెర జేసిన రైతన్న ‘ఛలో ఢిల్లీ’ పేరుతో పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా పోరాటానికి కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. రైతులు-హర్యానా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై ఆయన మీడియాతో మాట్లాడారు.

ఖనౌరీ-శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. చాలా మంది రైతులు గాయపడ్డారని, చాలా మంది కనిపించడం లేదని పందేర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని రాబోయే రెండు రోజుల పాటు 'ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, ఈ రెండు రోజుల విరామంలో గాయపడిన, తప్పిపోయిన రైతుల కుటుంబాలను కలుస్తామని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత హామీ విషయంలో ప్రభుత్వం పారిపోతోందని అన్నారు. రైతులు రహదారిని అడ్డుకోలేదని, ప్రభుత్వమే అడ్డుకుందని ఆయన అన్నారు. శాంతియుతంగా ముందుకు వెళ్తామని చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.

కాగా బుధవారం రైతులు-హర్యానా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువ రైతు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మరో ఇద్దరు రైతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పాటియాలాలోని రజింద్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రేఖీ వెల్లడించారు. ఇక హర్యానా పోలీసు అధికారి మనీషా చౌదరి స్పందించారు. దాటా సింగ్-ఖానౌరీ సరిహద్దులో రైతు నిరసనకారులను పోలీసు సిబ్బందిని చుట్టుముట్టారని తెలిపారు. పోలీసులను అడ్డుకునేందుకు పంట వ్యర్థాలను తగలబెట్టి మంటల్లో కారం పోశారని, పోలీసులపైకి రాళ్లు రువ్వారని తెలిపారు. కర్రలతో పోలీసులపై దాడి చేశారని, జరిగిన
ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని మనీషా చౌదరి వివరించారు.

Untitled Document
Advertisements