జాతీయ పక్షికి త్రివర్ణపతాకంతో అంత్యక్రియలు..!

     Written by : smtv Desk | Tue, May 08, 2018, 12:26 PM

జాతీయ పక్షికి త్రివర్ణపతాకంతో అంత్యక్రియలు..!

ఢిల్లీ, మే 8: సాధారణంగా యుద్ధాల్లో వీరమరణం పొందిన సైనికులకు అధికారిక లాంఛనాలతో త్రివర్ణపతాకం కప్పి అంత్యక్రియలు జరిపిస్తారన్న విషయం తెలిసిందే. కానీ దిల్లీకి చెందిన కొందరు పోలీసులు చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.

వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని హైకోర్టు పరిసరాల్లో గాయాలతో కన్పించిన ఓ నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది అప్పటికే చనిపోయి ఉండడంతో దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి చెక్క పెట్టలో ఉంచారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..‘మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చాం. ఇది ప్రొటోకాల్‌. మున్ముందు ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని వెల్లడించారు.

చనిపోయిన ఈ నెమలి షెడ్యూల్‌-1కు చెందిన పక్షి. అంటే 1972 వన్యసంరక్షణ చట్టం ప్రకారం ఈ పక్షి సంబంధించిన అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అలాంటిది చనిపోయిన నెమలిని అటవీ శాఖకు అప్పగించకుండా పోలీసులే సొంతంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements