మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విప్లవ్‌ దేవ్

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 04:00 PM

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విప్లవ్‌ దేవ్

అగర్తల, మే 11 : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి రవీంద్రనాథ్‌ ఠాకూర్ జయంతి వేదికైంది. సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రుడు బ్రిటీష్ చర్యలకు వ్యతిరేకంగా ఆ అవార్డును తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అయితే విప్లవ్ దేవ్ వాస్తవాలు విస్మరించి బెంగాలీ కవి రవీంద్రనాథ్‌ గురించి ప్రస్తావించారు. గీతాంజలి రచనకు గానూ 1913లో రవీంద్రనాథ్‌ సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. విభిన్న రంగాల్లో ఆయనకున్న అపార జ్ఞానాన్ని గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం 1915లో నైట్‌హుడ్‌ను ప్రదానం చేసింది.

అయితే 1919లో పంజాబ్‌లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతంతో తీవ్ర ఆవేదనకు లోనైనా ఠాగూర్ బ్రిటీష్‌ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా వారు ఇచ్చిన నైట్‌హుడ్‌ను మాత్రమే వెనక్కి ఇచ్చివేశారు. ఆ బిరుదును తిరస్కరిస్తున్నట్లు అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌కు లేఖ కూడా రాసి తన నిరసనను వ్యక్తం చేశారు.

గతంలో కూడా విప్లవ్‌ దేవ్‌ చేసిన అనేక వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని, డయానా ప్రపంచ సుందరిగా ఎంపికపైనా, ప్రభుత్వ విమర్శకుల గోళ్లు కత్తిరిస్తా అంటూ అనేక మార్లు తన నోటికి పని చెప్పారు. అంతే కాకుండా యువత ప్రభుత్వోద్యాగాల వెంటబడి సమయం వృథా చేసుకోకుండా పాన్‌ షాపులు నడుపుకోమని, గోవులు పెంచుకోమని ఉచిత సలహా ఇచ్చారు.





Untitled Document
Advertisements