రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడమే జగన్ ఆలోచన : సోమిరెడ్డి

     Written by : smtv Desk | Sat, May 12, 2018, 05:29 PM

రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడమే జగన్ ఆలోచన : సోమిరెడ్డి

అమరావతి, మే 12 : ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవాలనేదే వైఎస్ జగన్ ఆలోచనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఘటన గురించి ప్రస్తావించిన ఆయన.. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తెదేపా సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా జగన్‌ పత్రిక వార్తలు రాయడం హేయమైన చర్య అన్నారు. పట్టిసీమ వల్ల ఈ ఏడాది రాయలసీమకు 146 టీఎంసీల నీరు వచ్చిందని... ఆనాడు పట్టిసీమను వ్యతిరేకించిన విధంగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

విజయసాయిరెడ్డి కర్ణాటక వెళ్లి యడ్యూరప్పని కలిసి అక్కడ భాజపా గెలుపు కోసం పనిచేస్తూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంటున్నారని వ్యాఖ్యానించారు. భాజపా నేతల కాళ్లు పట్టుకుని వైకాపా లాలూచీ రాజకీయాలు చేస్తుందన్నారు. తమిళనాడుకి మోదీ వెళితే నల్ల బ్యాడ్జీలు చూపించలేదా... నిర్మలా సీతారామన్‌ వెళితే అడ్డుకోలేదా అని ప్రశ్నించారు.





Untitled Document
Advertisements