దొరికిన లాంచీ ఆచూకీ.. కొనసాగుతున్న సహాయక చర్యలు

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 12:16 PM

దొరికిన లాంచీ ఆచూకీ.. కొనసాగుతున్న సహాయక చర్యలు

దేవీపట్నం, మే 16 : గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కొండమొదలు మధ్య మంటూరు ఎగువ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న లాంచీ ఈదురు గాలుల తాకిడితో నీట మునిగిన విషయం తెలిసిందే . ప్రమాద సమయంలో లాంచీలో సుమారు 55మంది ఉండగా, వారిలో 15 మంది వరకు ఈదుకుంటూ తప్పించుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

విశాఖ నుంచి నేవీ ప్రత్యేక సహాయక బృందంతో పాటు బోటు మునిగిన ప్రాంతం వద్ద గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నేవల్‌ డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు మూడు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోటు ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. గాలింపు, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆయన ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి వెళ్లనున్నారు.

నిన్న సుమారు 55 మందితో ప్రయాణిస్తున్న లాంచీ భారీ వర్షానికి తోడు తీవ్రమైన గాలులు వీచడంతో అదుపుతప్పి గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయచర్యలకు విఘాతం కలిగింది. అయినప్పటికీ 120 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రాత్రంతా గాలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Untitled Document
Advertisements