కేకేఆర్ ఆటగాళ్ల నోటా.. కింగ్ ఖాన్ డైలాగులు

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 12:29 PM

 కేకేఆర్ ఆటగాళ్ల నోటా.. కింగ్ ఖాన్ డైలాగులు

కోల్‌కతా, మే 17: ఐపీఎల్ -11 సీజన్ లో లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. పట్టికలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. మిగతా రెండు స్థానాల కోసం ముంబై ఇండియన్స్, కింగ్స x1 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడుతున్నాయి. పంజాబ్‌, రాజస్థాన్‌ పై వరుస విజయాలతో ప్లేఆఫ్‌ రేసు ఆశలను సజీవంగా ఉంచుకుంది కోల్‌కతా జట్టు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో కోల్‌కతా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆట నుంచి కాస్త విరామం తీసుకున్న ఆటగాళ్లు ఆ జట్టు యజమాని, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ డైలాగులను పలుకుతూ సందడి చేశారు.

కింగ్‌ఖాన్‌ నటించిన సినిమాల్లోని ఫేమస్‌ డైలాగులు చెప్పడంలో ఆటగాళ్ల కాస్త తడబడ్డారు. కోల్‌కతా జట్టు సారథి దినేశ్‌ కార్తీక్‌, క్రిస్‌లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, పీయూష్‌ చావ్లా, కుల్‌దీప్‌ యాదవ్‌, శివమ్‌ మావి, శుభ్‌మన్‌గిల్‌ షారుక్‌లా నటించేందుకు, డైలాగులు చెప్పేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ జట్టు నిర్వాహకులు ట్విటర్‌ షేర్ చేశారు.

ఆస్ట్రేలియా ఆటగాడైన క్రిస్‌ లిన్‌ రయిస్‌ సినిమాలోని ‘బ్యాటరీ నహీ బోల్నే కా’ డైలాగ్‌ చెప్పాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌, మైహూనా, దిల్‌వాలే చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెబుతూ ఆటగాళ్లు సందడి చేశారు. ఈ వీడియో చూసిన షారుక్‌ ట్విటర్ ద్వారా స్పందించాడు. ‘నేను నా జట్టును ఎంతో ప్రేమిస్తున్నాను. అందుకే ఈ డీల్‌. నేను మీ కోసం క్రికెట్‌ వదిలేస్తాను. మీరు నా కోసం యాక్టింగ్‌ వదిలేయండి’ అని సరదాగా పేర్కొన్నాడు.Untitled Document
Advertisements