కన్నడ కదనం : 'ఓటు'.. నీ దారేటూ..

     Written by : smtv Desk | Sat, May 19, 2018, 03:23 PM

 కన్నడ కదనం : 'ఓటు'.. నీ దారేటూ..

బెంగళూరు, మే 19 : కన్నడ రాజకీయం ఇంచు మించుగా తుది ఘట్టంకు చేరుకుంది. కర్ణాటక ఓటర్లు నికరమైన తీర్పు ఇవ్వని పర్యవసానంగా అక్కడ కొనసాగుతున్న ఉత్కంఠ పరిణామాలకు ఈ రోజు ముగింపు పడనుంది. ఈ రోజు యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని గట్టెక్కాల్సి ఉంది. కాగా ఈ బల పరీక్షతో కర్ణాటకలో జరుగుతున్నా హై వోల్టాజి డ్రామాకు తెరపడనుంది.

అయితే ఇక్కడ బల పరీక్షలో నెగ్గాలంటే యడ్డీ ప్రభుత్వం డివిజన్‌ ఓటు ​ ద్వారా విశ్వాస తీర్మానాన్ని గట్టెక్కాల్సి ఉంది. ఇప్పటికే రహస్య ఓటింగ్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో వాయిస్‌ ఓటింగ్‌ లేదా, డివిజన్ ఓటుద్వారా బలాన్ని లెక్కించే అవకాశం ఉంది. వాయిస్‌ ఓటింగ్‌, డివిజన్‌ ఓటింగ్‌ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం.


మూజువాణి (వాయిస్‌)ఓటు..
శాసన సభలో సభ్యుల అభిప్రాయాన్ని మూజువాణి ఓటు విధానంలో వెల్లడించడం. విశ్వాస పరీక్షకు సమాధానంగా అవును, లేదా కాదు అని సమాధానం చెప్పాలి. మద్దతుగా ఉండే సభ్యులంతా తొలుత అవును అని, వ్యతిరేకించే వారు కాదు అని సమాధానం ఇవ్వాలి. అనంతరం ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది వ్యతిరేకించారు అనేది లెక్కిస్తారు. ఇక్కడ స్పీకర్ నిర్ణయమే కీలకంగా ఉంటుంది.

డివిజన్‌ ఓటు..
చట్టసభలో సభ్యులు డివిజన్ ఓటు ద్వారా విశ్వాసాన్ని ప్రకటించడం.. దీనినే (హెడ్ కౌంట్) అని కూడా అంటారు. శనివారం కర్ణాటక శాసనసభలో జరగనుంది ఇదే. ఈ అంశంపై స్పీకర్ సభ్యుల అభిప్రాయాన్ని డివిజన్ ఓటింగ్ విధానంలో కోరుతారు. ఇందులో భాగంగా అనుకూలంగా ఉన్నవారిని, వ్యతిరేకించేవారిని, తటస్థంగా ఉండేవారిని వేర్వేరు సార్లు చేతులెత్తడం లేదా లేచినిలబడడం ద్వారా అభిప్రాయం కోరుతారు. అంటే అనుకూలంగా ఉన్నవారిని ఒకసారి లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కించగా.. తర్వాత వ్యతిరేకించేవారిని లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కగడతారు. చివరగా తటస్థంగా ఉండేవారి సంఖ్యను కౌంట్ చేస్తారు. అంతిమంగా ఆ అంశానికి ఎంతమంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకమనేది లెక్కించి.. నిర్ణయం తీసుకుంటారు.


ఇలాంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఎలా నెగ్గుతుంది...! కమలదళంకు తగిన మెజారిటీ ఉందా? కాంగ్రెస్ -జేడీఎస్ ఎమ్మేల్యేలు యడ్డీ ప్రభుత్వానికి ఓటేస్తారా? ఎవరి మద్దతు ఎవరికీ ఉంటుందో కొన్ని గంటల్లో తేలనుంది. మరో వైపు సభలో బలం నిరూపించుకోలేని పరిస్థితి వస్తే.. యడ్యూరప్ప అంతకుముందే తన సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సాయంత్రం 4గంటలకు యడ్యూరప్ప బలపరీక్షలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరూ వీక్షించే సదుపాయాన్ని కల్పించారు.
Untitled Document
Advertisements