కన్నడ నాట కుమార పర్వం..

     Written by : smtv Desk | Sun, May 20, 2018, 02:02 PM

కన్నడ నాట కుమార పర్వం..

బెంగళూరు, మే 20 : గత కొన్ని రోజులుగా కర్ణాటకలో జరుగుతున్నా రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాల ఆటకు నిన్నటితో ముగింపు పడింది. బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు జేడీఎస్‌ అధినేత కుమారస్వామి నూతన ముఖ్యమంత్రిగా 23న ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. బుధవారం కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఆయన ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌-జేడీఎస్‌ల మధ్య మంత్రి పదవుల పంపకంపై కూడా చర్చలు జోరుగా జరుగుతున్నాయి. 78 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితోపాటు పలు కీలక శాఖలు దక్కనున్నట్లు సమాచారం. కుమారస్వామి ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక శాఖను కూడా తన వద్దే ఉంచుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నేత జె. పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన హోంశాఖను అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


జేడీఎస్‌ నేతలు పుట్టరాజ్‌కి వ్యవశాయ శాఖ, విశ్వానాథ్‌కి విద్యా శాఖ, కాంగ్రెస్‌ నేతలు ఎం. కృష్ణప్పకు క్రీడల శాఖ, కృష్ణ బైరె గౌడకు సమాచార, ప్రచార శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు కూడా వార్తలు వెలువడుతన్నాయి. గవర్నర్‌ నుంచి అందిన ఆహ్వానం మేరకు శనివారం రాత్రి కుమారస్వామి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో చర్చలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వం సవ్వంగా సాగేందుకు రెండు పార్టీలతో కలిసి సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తామని కుమారస్వామి వెల్లడించారు.

Untitled Document
Advertisements