'నేల టిక్కెట్టు' రివ్యూ..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 02:38 PM

'నేల టిక్కెట్టు' రివ్యూ..

టైటిల్ : నేల టిక్కెట్టు
తారాగణం : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం : శక్తినాథ్‌ కార్తిక్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కల్యాణ్‌ కృష్ణ కురసాల
నిర్మాత : రామ్‌ తళ్లూరి
విడుదల తేది : 25-05-2018

టాలీవుడ్‌లో మాస్ మహా రాజాగా ప్రేక్షకులకు దగ్గరైన రవితేజకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ఆయన నుండి సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల 'రాజా ది గ్రేట్‌' సినిమాతో అలరించిన ఆయన తరువాత 'టచ్‌ చేసి చూడు' సినిమాతో నిరాశపరిచాడు. తాజాగా ఈ రోజు 'నేల టిక్కెట్టు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ టైటిల్ తో వచ్చిన రవితేజ ఆకట్టుకున్నాడా..! 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రాలతో విజయాలను అందుకున్న కల్యాణ్‌కృష్ణ మరో హిట్ అందుకున్నాడా.. చూద్దాం..

కథ : చిన్నప్పటి నుండి అనాథలా పెరిగిన నేల టిక్కెట్ (రవితేజ) చుట్టూ జనం మధ్యలో మనం, జీవితంలో అందరినీ కలుపుకుని పోవాలి అనే మనస్తత్వంతో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తుంటాడు. అలా జనానికి సహాయం చేసే క్రమంలో అతనికి, హోమ్ మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)కి మధ్యన తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఒకానొక సందర్భంలో నేల టిక్కెట్ తాను కావాలనే ఆదిత్య భూపతితో గొడవ పెట్టుకుంటున్నానని అంటాడు. అసలు నేల టిక్కెట్ హోమ్ మంత్రిని ఎందుకు లక్ష్యం చేశాడు. వారిద్దరికీ మధ్యన సంబంధం ఏమిటి..? హోమ్ మంత్రి చేసిన తప్పేమిటి..? అన్నదే కథ.


విశ్లేషణ : సినిమా మొత్తంలో రవితేజ నటన ఆకట్టుకుంటుంది. మాస్ మహారాజ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేశాడు. యాక్షన్ , హాస్య సన్నివేశాల్లో బాగానే నటించాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కొన్ని మంచి సన్నివేశాలను రాయడంతో అక్కడక్కడా సినిమా కొంత పర్వాలేదనిపించింది. కథానాయక మాళవిక శర్మకు ఇదే తొలి చిత్రం. చూడ్డానికి బాగానే ఉన్నా రవితేజతో పాటు ఆమె కెమెస్ట్రీ అంతగా వర్కవుటు అవ్వలేదనే చెప్పాలి.

కథలో కొత్తదనం లేకపోవడం.. మంచికీ చెడుకీ మధ్య యుద్ధం ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర తెరపై చూస్తున్నదే కావడంతో ప్రేక్షకుడు కొంత నిరాశకు లోనవ్వుతాడు. ఇక సినిమా అసలు కథలోకి ప్రవేశించే ఇంటర్వెల్ సన్నివేశం బాగుంది. ఆ సన్నివేశంతో సెకండాఫ్ మీద కొంత ఆసక్తి ఏర్పడింది. ఇక మధ్య మధ్యలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, ప్రియదర్శి, అలీలు చేసిన కామెడీ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఒకే అనిపించింది. సంగీతం వింటుంటే 'ఫిధా' సినిమాకు అద్భుతమైన సంగీతం ఇచ్చిన శక్తి కాంత్ పాటలా ఇవి అనే అనుమానం కలగక మానదు.


సమీక్ష : కథ, కాన్సెప్ట్ బాగున్నా సినిమాను దర్శకుడు తెరకెక్కించడంలో తడబడ్డాడు. రవితేజ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్లాక్ మినహా ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలేవీ కనబడవు. క‌ల్యాణ్ కృష్ణ బ‌ల‌హీన‌త‌ల‌న్నీ.. ఈ సినిమాతో బయటపడ్డాయి. దర్శకుడిగానే కాదు రచయితగానూ ఇంకా కసరత్తులు చేస్తే బాగుండేది.

బలాలు:
+ రవితేజ నటన
+ కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

బలహీనతలు:
- క‌థ‌లో కొత్త‌దనం లేక‌పోవ‌డం.. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌
- సంగీతం
- హాస్యం లోపించడం

రేటింగ్ : 2.25/5

గమనిక : ఈ చిత్ర సమీక్ష సినిమా చూసిన ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం. పాఠకులు గమనించగలరు.





Untitled Document
Advertisements