ఏదో జరుగుతోంది.. ఏం చేశానో నాకే తెలియదు...

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 06:49 PM

ఏదో జరుగుతోంది.. ఏం చేశానో నాకే తెలియదు...

హైదరాబాద్, మే 25 : సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన "మహానటి" చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించారు. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. సమంత, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విశేషమైన స్పందన లభించింది. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ జీవం పోశారంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించి అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్ మాట్లాడుతూ..‌ ఈ సినిమా క్రెడిట్‌ మొత్తం నేనే తీసుకోవాలని నాకూ ఉంది. కానీ, అది కుదరని పని. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. నిర్మాతలుగా ప్రియాంక, స్వప్నలకు ఇది ఓ రిస్క్ లాంటిది. చాలా బడ్జెట్‌ పెట్టారు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి, ప్రేమగా సినిమా చేశారు. ఈ సినిమాలో కనిపించని ఎఫెక్ట్స్ చాలా‌ ఉంటాయి. ఓ షాట్‌ తీయడానికి వందల మంది పనిచేశారు. తమ శక్తికి మించి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి, సినిమాను ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ ఏదో జరుగుతోంది. ఏం చేశానో నాకే తెలియదని అన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముందు నాకు సావిత్రి గురించి పెద్దగా తెలియదు. తొలిరోజు ప్రివ్యూ చూసి నా మైండ్‌ బ్లో అయ్యింది. నా కాస్ట్యూమ్స్‌ వరకు నేను చూసుకున్నా. మిగతా పనులేమి నేను చూడలేదు. కానీ.. సినిమా విడుదలైన తర్వాత చూస్తే నా వెనుక ఇంత జరిగిందా? అనుకున్నా. మీ అందరికి నచ్చిన మరో సినిమాలో నా భాగస్వామ్యం ఉండటం చాలా సంతోషంగా ఉంది. 'మహానటి'లో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements