ప్రజా యాత్రలు.. రాజకీయ దీక్షలు.. ఎవరి కోసం..?

     Written by : smtv Desk | Mon, Jun 04, 2018, 11:00 AM

ప్రజా యాత్రలు.. రాజకీయ దీక్షలు.. ఎవరి కోసం..?

విజయవాడ, జూన్ 4 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ అప్పుడే మొదలైనట్టు ఉంది. ప్రజా యాత్రల పేరుతో ముఖ్య పార్టీలు ప్రజలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పరస్పరం తీవ్రస్థాయిలో దూషించుకుంటున్నాయి. అంతే కాకుండా వీటికి యాత్రలు, దీక్షలు అంటూ పేర్లు పెట్టి రంగంలోకి దిగుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇప్పటి నుండే రాజకీయపార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

అధికార టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తమ ప్రధాన ప్రత్యర్ధి బీజేపీనే అని చెప్పకనే చెప్పేశారు. మరో వైపు జగన్ 'ప్రజాసంకల్పయాత్ర' పేరుతో అలుపెరగని పయనం చేస్తుండగా... జనసేన అధినేత పవన్ 'పోరాట యాత్ర' అంటూ ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటనతో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ రెండు పార్టీలు టీడీపీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు కర్నూల్ లో 'నవనిర్మాణ దీక్ష' వేదికగా కేంద్రప్రభుత్వం మీద తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. వైసీపీ, జనసేన వెనుక కమలదళం ఉందని ఆరోపణలు చేస్తున్నారు.

మరో వైపు ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్పయాత్రలో అధికారపార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బాబు యూ టర్న్ అంకుల్ అంటూ ఆ పార్టీ నేతలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. బీజేపీతో తొలుత లాలుచి పడి.. తర్వాత విడిపోయి ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎదో రకంగా టీడీపీను లక్ష్యంగా చేసుకొని వారి వైఫల్యాలును బయటకు తీస్తున్నారు.

ఉత్తరాంధ్రలో పవర్ స్టార్ అయితే తన వాగ్దాటితో అధికారపార్టీపై చేస్తున్న విమర్శలు ఆ పార్టీకు పెద్ద తలనొప్పిగా మారాయి. శ్రీకాకుళం, విజయనగరంలో సమస్యలు.. వాటిని తీర్చడంలో ప్రభుత్వ పనితీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2014లో తమకు మద్దతుగా నిలిచిన ఆయన ఇప్పుడు ఇలా మారడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.

మరి ఈ యాత్రలు రాజకీయంగా ఏ పార్టీకు లాభం చేకురుస్తాయో ఇప్పుడే చెప్పలేం. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు మధ్య అసలు సమస్యలు గాలికొదిలేసిన మన నాయకులు.. యాత్రల పేరిట ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలే ఆర్ధికంగా సమస్యలతో సతమవుతున్న రాష్ట్రాన్ని ఆదుకొనేది ఎవరంటే ఇప్పుడే చెప్పడం కష్టం. మరి ఈ యాత్రలు, దీక్షలు రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు తీసుకెళ్లడానికా..! లేదా అధికార దాహం తీర్చుకోవడానికా..! అంటే కాలమే సమాధానం చెప్పాలి.








Untitled Document
Advertisements