ఆర్జేడీలో అన్న'దమ్ము'ల మధ్య పోరు..

     Written by : smtv Desk | Sun, Jun 10, 2018, 11:09 AM

ఆర్జేడీలో అన్న'దమ్ము'ల మధ్య పోరు..

పట్నా, జూన్ 10 : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంలో లొల్లి మొదలైంది..! బీహార్ లో అతి పెద్ద పార్టీగా పేరున్న ఆర్జేడీ పార్టీలో అన్న'దమ్ము'ల మధ్య ఆధిపత్య పోరు మొదలైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. తమ్ముడు తేజస్వీ యాదవ్‌ పార్టీలో క్రియాశీలకంగా మారుతుండటం, తండ్రి వారసత్వాన్ని ఆయనే అందిపుచ్చుకుంటాడన్న అభిప్రాయలు వినబడుతున్నాయి. దీంతో లాలూ పెద్దకుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన శనివారం తన తమ్ముడితో చర్చించారు. బయటి వ్యక్తులు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, పార్టీ కార్యకలాపాల నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ తేజస్వీతో ఆయన అన్నట్లు తెలుస్తోంది.

అనంతరం ఓ వార్తా సంస్థతో తేజ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ- "మేమిద్దరం రాజకీయాల్లోనే ఉన్నాం. కానీ, ఆర్జేడీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు విచారం కలిగిస్తున్నాయి. కొన్ని సంఘ విద్రోహశక్తులు పార్టీలోకి ప్రవేశించి, ఆర్జేడీని నాశనం చేసేందుకు యత్నిస్తున్నాయి. కొందరు భ్రష్టులను తేజస్వీ పార్టీలోకి తీసుకున్నాడు. ఇప్పుడు వారు మా ఇద్దరి మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా... నా తమ్ముడిపై నాకు చాలా ప్రేమ ఉంది" అని అన్నారు. అయితే... తాను ఫోన్‌ చేస్తే తన కాల్స్‌ను తేజస్వీ స్వీకరించడంలేదని ఆయన పేర్కొనడం చెప్పడం విశేషం.

ఇటీవలి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్న తేజస్వీ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి వ్యూహరచన చేసి తన రాజకీయ ప్రతిభను చాటుకున్నారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పుడూ ఎంతో హుందాగా వ్యవహరించారు. అక్కడ సోనియాగాంధీ, మమతాబెనర్జీ, మాయావతి, రాహుల్‌గాంధీ తదితర జాతీయస్థాయి నేతలతో సన్నిహితంగా మెలిగారు.





Untitled Document
Advertisements