సమ్మె విరమించిన నాయీ బ్రాహ్మణులు..

     Written by : smtv Desk | Tue, Jun 19, 2018, 01:30 PM

సమ్మె విరమించిన నాయీ బ్రాహ్మణులు..

అమరావతి, జూన్ 19 : రాష్ట్రాలోని పలు ప్రధాన ఆలయాల్లో నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెను క్షురకులు ఉపసంహరించుకున్నారు. ఒక్కో కేశఖండనకు రూ.12 నుంచి రూ.25 పెంచుతామన్న సీఎం ప్రకటనకు అంగీకారం తెలిపారు. ఈ రోజు నుండి విధులకు హాజరవుతామని వెల్లడించారు. గౌరవం వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనతో పాటూ తమ సమస్యల పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం సచివాలయం దగ్గర హైడ్రామా తర్వాత.. జేఏసీ నేతలు ఉండవల్లిలోని ప్రజా దర్భార్‌లో సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

అంతకుముందు ఇదే అంశంపై భారీ హైడ్రామా జరిగింది. ‘కత్తిడౌన్‌’ చేసిన క్షురకులతో రెవెన్యూ, దేవదాయ శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం సచివాలయంలో చర్చలు జరిపారు. ఏడు ప్రధాన ఆలయాల నుంచి క్షురకుల సంఘాల ప్రతినిధులతోపాటు నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సచివాలయానికి వచ్చారు. వారిలో ముఖ్యమైన నేతలతో కేఈ చర్చలు జరిపారు.

ఈ చర్చలు విఫలం కావడంతో నేరుగా సీఎం వద్దే తేల్చుకోవాలని నిర్ణయించుకుని, సచివాలయంలో ఆందోళన చేద్దామని అక్కడున్న వారిలో కొందరు పిలుపునిచ్చారు. దీంతో అంతా కలిసి సచివాలయం రెండోబ్లాక్‌ ముందు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఒకటో బ్లాక్‌ నుంచి సీఎం కాన్వాయ్‌ బయలుదేరిన సమయంలో... రెండో బ్లాక్‌ వద్ద ఉన్న క్షురకులు పెద్దగా నినాదాలు చేశారు. ఇది చూసిన సీఎం ఆగి, కారు దిగి వారి వద్దకు వెళ్లారు. సీఎం వస్తారని క్షురకులు కూడా ఊహించలేదు. ఆయనను చూసిన తర్వాత... తమకు న్యాయం చేయాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. కొందరు ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అని నినదించారు. దీంతో సీఎం తీవ్ర అసహనానికి లోనయ్యి వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements